వరద విపత్తు విషయంలో .. సర్కారు తీరు దారుణం

వరద విపత్తు విషయంలో .. సర్కారు తీరు దారుణం
  • కోర్టు చెప్పినా ప్రభుత్వంలో చలనం లేదు: కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తలెత్తిన వరద విపత్తు విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పినా సర్కారులో చలనం లేదని మండిపడ్డారు. 

శనివారం గాంధీభవన్​లో కోదండ రెడ్డి అధ్యక్షతన ఫ్లడ్​ రిలీఫ్​ కో ఆర్డినేషన్​ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన విపత్తుపై రెండు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి అన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితిపై సమన్వయం చేస్తుందని, రెండోది పార్టీ ఆఫీసు నుంచి కో ఆర్డినేట్​ చేస్తుందని చెప్పారు. ​వరదల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వైద్య సౌకర్యాలూ అందడం లేదని తమ కమిటీ గుర్తించిందన్నారు. 

జిల్లాలవారీగా రివ్యూ చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. వరద నష్టంపై కేంద్రానికి దరఖాస్తు కూడా పెట్టని ఏకైక సీఎం కేసీఆరేనని కోదండ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలకతీతంగా ఫ్లడ్​ రిలీఫ్​ కమిటీని వేశామని చామల కిరణ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ సంగిశెట్టి జగదీశ్​ తెలిపారు.