- స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడి
- కొడంగల్‌లో మోడల్ సోలార్ విలేజ్ అవగాహన సదస్సు
కొడంగల్, వెలుగు: దేశంలోనే మొట్టమొదటి మోడల్సోలార్ మండలంగా కొడంగల్‌కు గుర్తింపు దక్కనుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం కొడంగల్ మున్సిపాలిటీలో నిర్వహించిన మోడల్ సోలార్ విలేజ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లు రాష్ర్ట ప్రభుత్వం సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిని 100 శాతం సోలార్ గ్రామంగా మార్చామని చెప్పారు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోని కొడంగల్ మండలాన్ని 30 నుంచి 40 రోజుల్లో మోడల్ సోలార్ మండలంగా మారుస్తామని పేర్కొన్నారు. కొడంగల్ మండలంలోని 34 గ్రామాల్లో 5186 రూఫ్ టాప్, 2865 వ్యవసాయ పంప్సెట్లకు సోలార్ కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. వ్యవసాయం, ఇంటి అవసరాలకు సోలార్ విద్యుత్ వినియోగంతో ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతు అదనంగా ఆదాయం పొందేందుకు వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ల సోలార్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. మిగులు విద్యుత్ అమ్ముకోవడం ద్వారా రైతు ఏటా రూ.18 వేల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. అలాగే గృహలక్ష్మి లబ్ధిదారులకు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఫ్రీగా ఏర్పాటు చేయడం ద్వారా 240 యూనిట్ల కరెంట్ జనరేట్ అవుతుందని తెలిపారు. మిగులు విద్యుత్ విక్రయించడం ద్వారా యునిట్‌కు రూ. 2.57 లబ్ధిదారుడికి చెల్లిస్తామని వెల్లడించారు.
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ మాట్లాడుతూ కొడంగల్ మండలంలోని 34 గ్రామాల్లో ఉచితంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. టీజీ రెడ్కో ఎండీ అనిల మాట్లాడుతూ సంప్రదాయ విద్యుత్‌కు బదులుగా సోలార్ పవర్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 81 గ్రామాలను ఎంపిక చేశామని, అందులో రూఫ్‌టాప్‌లు 40,349 అగ్రికల్చర్ పంప్సెట్లు 16,805 ఉన్నాయని తెలిపారు.
