
వరల్డ్‌కప్ బరిలో నిలిచిన 15 మంది ప్లేయర్లు ప్రతిభావంతులే అయినా.. కెప్టెన్ కోహ్లీ, ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా మాత్రం మెగా టోర్నీలో ఇండియాకు అత్యంత కీలకం కానున్నారు. పోరాటస్పూర్తి, విజయకాంక్షను నరనరాన నింపుకున్న విరాట్ కోహ్లీ తన ఉనికితోనే సహచరుల్లో కొండంత ధైర్యాన్ని, ప్రత్యర్థుల్లో భయాన్ని నింపుతాడు. కోహ్లీ ఏ క్షణంలో కూడా అజాగ్రత్తగా ఉండడు, ఆట నుంచి బయటకు పోడు. తన టీమ్‌మేట్స్ కూడా అలానే ఉండాలంటాడు. విరాట్ బ్యాట్‌పవర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఊపులోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాబోదు. ఇక, ధోనీ అనుభవం జట్టుకు ప్లస్ పాయింట్. పరిస్థితులను అంచనా వేయడంలో, మ్యాచ్‌ను చదవడంలో మహీని మించినోడు లేడు. కీపర్, ఫినిషర్‌గానే కాకుండా మెంటార్‌గా అతను టోర్నీలో అత్యంత కీలకం. సుదీర్ఘ కెరీర్, మూడు వరల్డ్‌కప్‌ల అనుభవంతో ధోనీ జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నాడు. వ్యూహాలు రచించడంలో, బౌలర్లను మార్చడంలో, ఫీల్డింగ్ మార్పుల్లో, రివ్యూల్లో కెప్టెన్ కోహ్లీకి, ఎలాంటి బంతులు వేయాలో బౌలర్లకు మహీ ఇచ్చే సలహాలు అమూల్యం. ‘నయా కపిల్’గా పేరు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాపై కూడా జట్టు భరోసా ఉంచింది. ఆల్‌రౌండర్ కోటాలో తుదిజట్టులో కచ్చితంగా ఉండే హార్దిక్ రెండు విభాగాల్లో రాణిస్తే ఇండియాకు తిరుగుండకపోవచ్చు. ముగ్గురు పేసర్లలో వయసులో, అనుభవంలో చిన్నోడైనప్పటికీ బుమ్రా ఇంగ్లండ్‌లో పెద్దన్న పాత్ర పోషించనున్నాడు. కొంతకాలంగా నిలకడగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా వద్ద యార్కర్లే కాకుండా మరెన్నో అస్త్రాలున్నాయి.