
జూబ్లీహిల్స్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనుబంధంగా ఉన్న హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని శ్రీవారి ఆలయంలో ఈనెల 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంట్లో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమంతో ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండ్రోజుల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.