నేతల బహిరంగ చర్చకు నో  పర్మిషన్

నేతల బహిరంగ చర్చకు నో  పర్మిషన్

నాగర్​కర్నూల్, వెలుగు: కొల్లాపూర్‌‌‌‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్‌‌ రెడ్డి సవాళ్లకు పోలీసులు బ్రేక్ వేశారు.  ఈ నెల 26న బహిరంగ చర్చకు  పర్మిషన్‌‌ కావాలని  ఇరువర్గాల నేతలు పెట్టుకున్న అప్లికేషన్లకు నో చెప్పారు. ఆరోజు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్లు  ఎస్సీ కె. మనోహర్​ ప్రకటించారు.  రూల్స్‌‌ బ్రేక్ చేసి ఎవరైనా మీటింగులు పెట్టినా, గుమిగూడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

26న అంబేద్కర్‌‌‌‌ విగ్రహం దగ్గర చర్చ..

ఓటమి పరాభవం తర్వాత  సొంత పార్టీలో వివక్షతో రెండేళ్లుగా రగిలిపోతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాడో పేడో తేల్చుకుందామని సిద్ధమయ్యారు.  ‘ఎవరి చరిత్ర ఏంటో తేల్చుకుందాం’  అని, ఈ నెల 26న కొల్లాపూర్​ పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహం దగ్గర బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్​ రెడ్డికి సవాల్​విసిరారు.  స్పందించిన ఎమ్మెల్యే చర్చలతో అంబేద్కర్​ విగ్రహ స్థలాన్ని అపవిత్రం చేయడం ఎందుకని,  ఇంటికే వస్తా .. అక్కడే మాట్లాడుదామని కౌంటర్‌‌‌‌ ఇచ్చారు. వీరి అనుచరులు  కౌంట్​ డౌన్​ స్టార్ట్​ అంటూ సోషల్‌‌ మీడియాలో రోజుకో పోస్ట్​ పెడుతూ దీనికి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలో  26న ప్రజలు, పత్రికా ప్రతినిధుల సమక్షంలో ఓపెన్​ డిబేట్​ నిర్వహించడానికి పర్మిషన్‌‌ కావాలని  జూపల్లి అనుచరుడు పసుపుల నర్సింహ్మ పోలీసులకు అప్లికేషన్​ ఇచ్చాడు.  అదే రోజు ఎమ్మెల్యే ఇంటి నుంచి  జూపల్లి  ఇంటి వరకు ర్యాలీతో పాటు బహిరంగ చర్చకు పర్మిషన్‌‌ కావాలని భీరం అనుచరుడు కాటం జంబులయ్య అప్లై చేశాడు.  లా అండ్  ఆర్డర్​ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉండడంతో ఇరువురికి పర్మిషన్‌‌ ఇవ్వడం లేదని  ఎస్సీ మనోహర్ స్పష్టం చేశారు.