
- హాస్పిటల్‌పై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నరు?
- 7 వేల మంది గుమిగూడితే సమాచారం లేదా?
- పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైనట్టు?
- మాకు తెలియదని పోలీసులు చెప్పడం నమ్మేలా లేదు
- ఆర్జీ కర్ హాస్పిటల్‌ను మూసేస్తం
- క్రైమ్ సీన్ ఎలా ఉందో కోర్టుకు చెప్పాలని ఆదేశం
- డాక్టర్ హత్యకు కారణమైన దోషులను ఉరి తీయాల్సిందే: సీఎం మమత.. కోల్‌కతాలో భారీ ర్యాలీ
కోల్‌కతా: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌పై గురువారం తెల్లవారుజామున దాడి జరిగిందని కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడు వేల మంది గుమిగూడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించింది. ఆ టైమ్‌లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటు పోయిందని నిలదీసింది. నిరసనకారులు గుమిగూడుతున్న విషయం తెలీదని పోలీసులు చెప్పడం నమ్మశక్యంగా లేదని మండిపడింది. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన క్రైమ్ సీన్ ఎలా ఉందో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. క్రైమ్ సీన్ ఫొటోలతో పాటు వీడియో సమర్పించాలని సూచించింది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై పోలీసులు, హాస్పిటల్ మేనేజ్మెంట్ వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ టీఎస్ శివగ్నానమ్తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది?
‘‘ఆర్జీ కార్ హాస్పిటల్‌ను మూసివేస్తం. అక్కడున్న వారిని తరలిస్తం. ఇప్పుడు ఆ దవాఖానాలో ఎంత మంది రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నరు? గుంపుగా కొంత మంది పోస్టర్లు పట్టుకుని హాస్పిటల్లోకి దూసుకెళ్లారు. క్రైమ్ సీన్ కోసం వెతికారు. ఎమర్జెన్సీ వార్డు, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్‌ను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ అయ్యింది.
అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నరు? హాస్పిటల్‌పై దాడికి దారి తీసిన ఘటనలన్నింటినీ రికార్డు చేసి ఉంచాలి. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున.. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్తో పాటు హాస్పిటల్‌పై ప్రీ ప్లాన్డ్గా జరిగిన దాడిపై మధ్యంతర రిపోర్టును వెంటనే కోర్టుకు సబ్మిట్ చేయాలి’’ అని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. హాస్పిటల్ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో రీ ఇన్నోవేషన్ పనులు చేపట్టడం అవసరమా? అని ప్రభుత్వంపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్లకు రక్షణ లేకపోతే డ్యూటీ ఎట్ల చేస్తరు?
పోలీసుల సమక్షంలోనే హాస్పిటల్‌పై దాడి జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎలా విధులు నిర్వర్తిస్తారని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ‘‘డాక్టర్లతో పాటు హాస్పిటల్ సిబ్బందికి రక్షణ కల్పించాలి. లేకపోతే వాళ్లు విధులు నిర్వర్తించరు. ఇంతటి సున్నితమైన అంశంపై నిరసన తెలిపేందుకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో చెప్పాలి. బెంగాల్లో వేరే చోట ఇలాంటి ఘటనే జరిగితే ఏం చేస్తరు? దాడిలో పోలీసులే గాయపడ్డారు.
లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తున్నది. సొంత సిబ్బందినే కాపాడుకోలేకపోయిన పోలీసులు.. డాక్టర్లను ఏం కాపాడ్తరు?’’అని హైకోర్టు నిలదీసింది. ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో క్రైమ్‌సీన్ ఫొటోలు, వీడియోలు తీసి కోర్టుకు సబ్మిట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.
డాక్టర్లు, కొలీగ్స్ హస్తం ఉంది: మృతురాలి తల్లిదండ్రులు
తమ కూతురుపై అత్యాచారం, హత్యలో హాస్పిటల్‌లోని కొందరు కొలీగ్స్ హస్తం ఉందని సీబీఐ అధికారులకు మృతురాలి పేరెంట్స్ చెప్పారు. దీనిపై సీబీఐ అధికారి ఒకరు మాట్లాడారు. ‘ఆస్పత్రిలో పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లు, తమ కూతురు కొలీగ్స్‌పై బాధితురాలి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లు ఇచ్చిన పేర్ల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నం. 30 మందిని విచారణకు పిలిచాం.
ఇప్పటికే కొందరిని ప్రశ్నించాం. హౌస్ స్టాఫ్‌తో పాటు ఘటన జరిగిన రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు పీజీ ట్రైనీలకు సమన్లు జారీ చేశాం” అని సీబీఐ అధికారి తెలిపారు.