IPL 14: కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి

IPL 14: కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి

భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. ఐపీఎల్‌‌ ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో రైజ్​కాలేదు. దీంతో ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ 10 రన్స్‌‌ స్వల్ప తేడాతో హైదరాబాద్‌‌పై గెలిచింది. ముందుగా కోల్‌‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 రన్స్‌‌ చేసింది. లాస్ట్‌‌లో దినేశ్‌‌ కార్తీక్‌‌ (22 నాటౌట్‌‌) దంచికొట్టాడు. తర్వాత హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 రన్స్‌‌కే పరిమితమైంది. మనీశ్‌‌, బెయిర్‌‌స్టోకు తోడుగా లాస్ట్‌‌లో అబ్దుల్‌‌ సమద్‌‌ (19 నాటౌట్‌‌) చెలరేగినా టార్గెట్‌‌ను ఫినిష్‌‌ చేయలేకపోయాడు. నితీశ్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’ లభించింది.
రైట్‌‌.. రైట్‌‌ రాణా
వార్నర్‌‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకోవడంతో.. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (15)తో కలిసి నితీశ్‌‌ రాణా ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించాడు. ఎదుర్కొన్న ఫస్ట్‌‌ బాల్‌‌ను బౌండ్రీకి తరలించిన రాణా.. తనలోని హిట్టింగ్‌‌ సామర్థ్యాన్ని పర్‌‌ఫెక్ట్‌‌గా చూపెట్టాడు. హైదరాబాద్‌‌ బౌలర్లందర్ని టార్గెట్‌‌ చేస్తూ వరుసపెట్టి బౌండ్రీలు బాదాడు. రెండో ఓవర్‌‌లో రెండు, నాలుగో ఓవర్‌‌లో మూడు, తర్వాత మరో రెండు.. ఇలా పూనకం వచ్చినట్లు ఆడాడు. మధ్యలో గిల్‌‌ కూడా ఓ ఫోర్‌‌, సిక్స్‌‌ బాదడంతో పవర్‌‌ప్లేలో కేకేఆర్‌‌ 50 రన్స్‌‌ చేసింది. అయితే ఏడో ఓవర్‌‌లో ఎంటర్‌‌ అయిన రషీద్‌‌ (2/24).. గిల్‌‌ను ఎక్జిట్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 53 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ ఆనందంలో ఉన్న ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌కు రాహుల్‌‌ త్రిపాఠి రూపంలో పెద్ద ముప్పు ఎదురైంది. నబీ బాల్‌‌ను లాంగాఫ్‌‌లో సూపర్‌‌ సిక్సర్‌‌గా మలిచిన అతను.. రాణాకు మంచి సమన్వయం అందించాడు. దీంతో పదో ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌ను బ్యాక్‌‌వర్డ్‌‌ స్క్వేర్‌‌ లెగ్‌‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌ కొట్టిన రాణా 37 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. టీమ్‌‌ స్కోరు కూడా 83/1కి చేరింది. హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ కావడంతో రాణా ఆట మరో మెట్టు ఎక్కింది. నటరాజన్‌‌, నబీ, సందీప్‌‌ను టార్గెట్‌‌ చేసి డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌, ఫైన్‌‌ లెగ్‌‌లో మూడు సిక్సర్లు సంధించాడు. మధ్యలో త్రిపాఠి ఫోర్లతో రెచ్చిపోవడంతో రన్‌‌రేట్‌‌ వాయు వేగంతో ముందుకెళ్లింది. 11 నుంచి 15 ఓవర్లలో 62 రన్స్‌‌ రావడంతో కేకేఆర్‌‌ స్కోరు 145/1కు చేరింది. ఈ క్రమంలో 28 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన త్రిపాఠిని.. 16వ ఓవర్‌‌లో ఔట్‌‌ చేసిన నటరాజన్‌‌ హైదరాబాద్‌‌ను రేస్‌‌లోకి తెచ్చాడు. సెకండ్‌‌ వికెట్‌‌కు 50 బాల్స్‌‌లో 93 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. భారీ హిట్టర్‌‌ రసెల్‌‌ (5)ను రషీద్‌‌ బోల్తా కొట్టిస్తే, 18వ ఓవర్‌‌లో నబీ డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. వరుస బాల్స్‌‌లో రాణాతో పాటు మోర్గాన్‌‌ (2)ను పెవిలియన్‌‌కు పంపడంతో 200 దాటుతుందనుకున్న స్కోరు బోర్డుకు కళ్లెం పడింది. లాస్ట్‌‌లో షకీబ్‌‌ (3)ను కట్టడి చేసినా.. ఆఖరి ఓవర్‌‌లో కార్తీక్‌‌ 6, 4 బాదాడు. 
మనీష్‌‌, బెయిర్‌‌ షో..
సెకండ్‌‌ ఓవర్‌‌లోనే వార్నర్‌‌ (3) ఔటైతే.. ఫస్ట్‌‌ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌ను భారీ సిక్సర్‌‌గా మలిచిన సాహా (7) తర్వాతి ఓవర్‌‌లో పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో 10 రన్స్‌‌కే 2 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌‌ను మనీశ్‌‌,  బెయిర్‌‌స్టో  ఆదుకున్నారు. రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా, ఐదో ఓవర్‌‌లో షకీబ్‌‌ బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపిన బెయిర్‌‌స్టో టచ్‌‌లోకి వచ్చాడు. ఆ వెంటనే మనీశ్‌‌ కూడా ఫోర్‌‌, సిక్స్‌‌తో రెచ్చిపోయాడు. 8వ ఓవర్‌‌ (రసెల్‌‌)లో బెయిర్‌‌స్టో 4, 6, 4తో 15 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో మరో రెండు ఫోర్లు రాబట్టాడు. ఓవరాల్‌‌గా పవర్‌‌ప్లేలో 35/2 స్కోరు చేసిన హైదరాబాద్‌‌ ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌లో 77/2కు చేరింది. చేయాల్సిన రన్‌‌రేట్‌‌ ఎక్కువగా ఉండటంతో మనీష్‌‌ కూడా కాస్త బ్యాట్‌‌ ఝుళిపించే ప్రయత్నం చేశాడు. దీంతో 11వ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌తో 12 రన్స్‌‌ చేశారు. వరుణ్‌‌ చక్రవర్తి బాల్‌‌ను మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా భారీ సిక్సర్‌‌ కొట్టిన బెయిర్‌‌స్టో 32 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ తర్వాతి ఓవర్‌‌లోనే కమిన్స్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫలితంగా థర్డ్‌‌ వికెట్‌‌కు 67 బాల్స్‌‌లో 92 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. బెయిర్‌‌స్టో ఉన్నంతసేపు మెరుగైన స్థితిలో ఉన్న హైదరాబాద్‌‌ అదే దూకుడును కొనసాగించలేదు. షకీబ్‌‌ బౌలింగ్‌‌లో మనీశ్‌‌ సిక్సర్‌‌ కొట్టడంతో 15 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 118/3గా మారింది.  కానీ తర్వాతి ఓవర్‌‌లోనే నబీ (14) వెనుదిరిగాడు. వచ్చి రావడంతో విజయ్‌‌ శంకర్‌‌ (11) సిక్స్‌‌ బాదడంతో హైదరాబాద్‌‌ టార్గెట్‌‌ 18 బాల్స్‌‌లో 44గా మారింది. భారీ షాట్లకు ప్రయత్నించిన శంకర్‌‌.. 17వ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు కవర్స్‌‌లో మోర్గాన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. లాస్ట్‌‌లో అబ్దుల్‌‌ సమద్‌‌ రెండు భారీ సిక్సర్లతో ఆశలు రేకెత్తించినా.. ఆఖరి ఓవర్‌‌లో పాండే ఒక సిక్సర్‌‌కే పరిమితమయ్యాడు. 
స్కోరు బోర్డు
కోల్‌‌కతా: నితీశ్‌‌ రాణా (సి) శంకర్‌‌ (బి) నబీ 80, గిల్‌‌ (బి) రషీద్‌‌ 15, రాహుల్‌‌ త్రిపాఠి (సి) సాహా (బి) నటరాజన్‌‌ 53, రసెల్‌‌ (సి) పాండే (బి) రషీద్‌‌ 5, మోర్గాన్‌‌ (సి) సమద్‌‌ (బి) నబీ 2, దినేశ్‌‌ కార్తీక్‌‌ (నాటౌట్‌‌) 22, షకీబ్‌‌ (సి) సమద్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 3, ఎక్స్‌‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 187/6. వికెట్లపతనం: 1–53, 2–146, 3–157, 4–160, 5–160, 6–187. బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 4–0–45–1, సందీప్‌‌ శర్మ 3–0–35–0, నటరాజన్‌‌ 4–0–37–1, మహ్మద్‌‌ నబీ 4–0–32–2, రషీద్‌‌ ఖాన్‌‌ 4–0–24–2, విజయ్‌‌ శంకర్‌‌ 1–0–14–0. 

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌: సాహా (బి) షకీబ్‌‌ 7, వార్నర్‌‌ (సి) కార్తీక్‌‌ (బి) ప్రసీధ్‌‌ కృష్ణ 3, మనీశ్‌‌ పాండే (నాటౌట్‌‌) 61, బెయిర్‌‌స్టో (సి) రాణా (బి) కమిన్స్‌‌ 55, నబీ (సి) మోర్గాన్‌‌ (బి) ప్రసీధ్‌‌ కృష్ణ 14, విజయ్‌‌ శంకర్‌‌ (సి) మోర్గాన్‌‌ (బి) రసెల్‌‌ 11, అబ్దుల్‌‌ సమద్‌‌ (నాటౌట్‌‌) 19, ఎక్స్‌‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 177/5.  వికెట్లపతనం: 1–10, 2–10, 3–102, 4–131, 5–150.  బౌలింగ్‌‌: హర్భజన్‌‌ 1–0–8–0, ప్రసీధ్‌‌ కృష్ణ 4–0–35–2, షకీబ్‌‌ 4–0–34–1, కమిన్స్‌‌ 4–0–30–1, రసెల్‌‌ 3–0–32–1, వరుణ్‌‌ చక్రవర్తి 4–0–36–0.