కోల్‌‌ కథ మిగిలే ఉంది.. 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం

కోల్‌‌ కథ మిగిలే ఉంది.. 4 వికెట్ల తేడాతో  ముంబైపై విజయం
  •     రాణించిన మనీష్‌‌, పావెల్‌‌
  •     ముంబై బ్యాటర్లు ఫెయిల్‌‌

కోల్‌‌కతా: ప్లే ఆఫ్స్‌‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ జూలు విదిల్చింది. అద్భుతమైన బౌలింగ్‌‌తో ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆపై బ్యాటింగ్‌‌లోనూ మెరిసింది. ఫలితంగా బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో కేకేఆర్‌‌ 4 వికెట్ల తేడాతో ముంబైపై నెగ్గింది. టాస్‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. కార్బిన్‌‌ బోష్‌‌ (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 32 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (26) మాత్రమే మెరుగ్గా ఆడారు. తర్వాత కోల్‌‌కతా 18.5 ఓవర్లలో 148/6 స్కోరు చేసి నెగ్గింది. మనీష్‌‌ పాండే (45), రోవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (40) రాణించారు. 

బౌలర్లు అదుర్స్‌‌..

బౌలింగ్‌‌కు అనుకూలించిన పిచ్‌‌పై కేకేఆర్‌‌ బౌలర్లు చెలరేగిపోయారు. కీలక టైమ్‌‌లో వికెట్లు తీయడంతో పాటు రన్స్‌‌నూ కట్టడి చేశారు. ఫలితంగా ముంబై టాప్‌‌, మిడిలార్డర్‌‌ బ్యాటర్లు ఘోరంగా ఫెయిలయ్యారు. రికెల్టన్‌‌ (6), రోహిత్‌‌ (15) తొలి రెండు ఓవర్లలో 10 రన్సే చేశారు. కానీ మూడో ఓవర్‌‌లో గ్రీన్‌‌ (2/23) నాలుగు బాల్స్‌‌ తేడాలో రికెల్టన్‌‌, నమన్‌‌ ధీర్‌‌ (0)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. దాంతో ముంబై 17/2తో కష్టాల్లో పడింది. రోహిత్‌‌తో కలిసి సూర్యకుమార్‌‌ (15) ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. సౌరభ్‌‌ దూబే (2/34) తన వరుస ఓవర్లలో రోహిత్‌‌, సూర్యను ఔట్‌‌ చేయడంతో 41/4తో ముంబై కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ దశలో తిలక్‌‌ వర్మ (20), కెప్టెన్‌‌ హార్దిక్‌‌ పాండ్యా ఆచితూచి ఆడారు. దాంతో ముంబై 46/4తో పవర్‌‌ప్లేను ముగించింది. 8 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్‌‌కు కాసేపు అంతరాయం కలిగింది. తర్వాత ఈ ఇద్దరు సింగిల్స్‌‌తో కుదురుకునేందుకు ప్రయత్నించారు. నాలుగు ఓవర్లలో 22 రన్స్‌‌ రావడంతో తొలి పది ఓవర్లలో ముంబై స్కోరు 64/4గా మారింది. 12, 13వ ఓవర్లలో తిలక్‌‌, హార్దిక్‌‌ చెరో సిక్స్‌‌తో బ్యాట్లు ఝుళిపించారు. కానీ 14వ ఓవర్‌‌లో కార్తీక్‌‌ త్యాగీ (2/37) తిలక్‌‌ను ఔట్‌‌ చేసి ఐదో వికెట్‌‌కు 43 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. విల్‌‌ జాక్స్‌‌ (14) ఫోర్‌‌తో టచ్‌‌లోకి రాగా, హార్దిక్‌‌ బౌండ్రీతో స్కోరు 15 ఓవర్లలో 94/5గా మారింది. 16వ ఓవర్‌‌లో నరైన్‌‌ (1/13) దెబ్బకు హార్దిక్‌‌ వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌‌లో విల్‌‌ జాక్స్‌‌ రనౌటయ్యాడు. 18వ ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టిన కార్బిన్‌‌ బోష్‌‌ తర్వాత 4, 6, 6, 4 దంచగా, మధ్యలో దీపక్‌‌ చహర్‌‌ (10) రెండు ఫోర్లు రాబట్టాడు. దాంతో చివరి రెండు ఓవర్లలో 32 రన్స్‌‌ రావడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  

ఇద్దరు మాత్రమే..

చిన్న ఛేజింగ్‌‌లో కోల్‌‌కతాకు మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌ ఆరో బాల్‌‌కే అలెన్‌‌ (8)ను దీపక్‌‌ చహర్‌‌ (1/23) క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. మనీష్‌‌ పాండేతో కలిసి ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే బాధ్యత తీసుకున్న రహానే (21) వేగంగా ఆడినా వికెట్‌‌ కాపాడుకోలేదు. ఆరో ఓవర్‌‌లో బోష్‌‌ (3/30)కు వికెట్‌‌ ఇచ్చాడు. దాంతో 48 రన్స్‌‌కే రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌‌కతా 51/2తో పవర్‌‌ప్లేను ముగించింది. ఈ దశలో మనీష్  నిలకడగా ఆడినా.. భారీ ఆశలు పెట్టుకున్న కామెరూన్‌‌ గ్రీన్‌‌ (4)ను బోష్‌‌ దెబ్బకొట్టాడు. దాంతో కేకేఆర్‌‌ 54/3తో ఎదురీత మొదలుపెట్టింది. మనీష్‌‌తో కలిసిన పావెల్‌‌ క్రమంగా ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో 33 రన్స్‌‌ రావడంతో కోల్‌‌కతా పది ఓవర్లలో 84/3 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి వేగం పెంచిన పావెల్‌‌, పాండే సింగిల్స్‌‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. 13వ ఓవర్‌‌లో ఈ ఇద్దరు మూడు ఫోర్లు కొట్టారు. కానీ 15వ ఓవర్‌‌లో బుమ్రా (1/26).. మనీష్‌‌ను ఔట్‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌కు 64 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. చివరి 30 బాల్స్‌‌లో 30 రన్స్‌‌ చేయాల్సిన దశలో సిక్స్‌‌ కొట్టి పావెల్‌‌ ఔటయ్యాడు. రింకూ సింగ్‌‌ (9 నాటౌట్‌‌) 4, 4 కొట్టగా తేజస్వి దహియా (11) 4, 4 దంచి వెనుదిరిగాడు. అనుకూల్‌‌ రాయ్‌‌ (4 నాటౌట్‌‌) మిగతా రన్స్‌‌ను అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 147/8 (బోష్‌‌ 32*, పాండ్యా 26, గ్రీన్‌‌ 2/23). కోల్‌‌కతా: 18.5 ఓవర్లలో 148/6 (మనీష్‌‌ 45, పావెల్‌‌ 40, బోష్‌‌ 3/30).