ఒకప్పుడు నిజాం నవాబుల అంతఃపురాలకే పరిమితమైన కొల్లాపూర్ మామిడి పండ్లు.. ఇప్పుడు అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల మార్కెట్లలో విశేష ఆదరణ పొందున్నాయి. అత్యంత తీయదనం, సువాసన, టాప్ క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పండ్ల రుచి మన తెలంగాణ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. విదేశాల్లో వీటికి వస్తోన్న డిమాండ్ చూసి మన రైతుల్లో కొత్త ఆశల చిగురిస్తున్నాయి. రానున్న రోజుల్లో కొల్లాపూర్ మామిడి నమ్మకమైన బ్రాండ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
కొల్లాపూర్ మామిడి పేరు ఇప్పుడు విదేశాల్లోనూ మార్మోగుతోంది. నాటి నిజాం నవాబులు, బ్రిటిష్ పాలనా కాలం నుంచే ఈ మామిడి పండ్లకు ఎంతో డిమాండ్ ఉంది. కొల్లాపూర్‌లోని సురభి రాజుల తోటల్లో పండించిన మామిడి పండ్లను అప్పట్లో రాజులకు ప్రత్యేకంగా పంపేవారని ప్రసిద్ధి. కొల్లాపూర్ ప్రాంతంలోని సారవంతమైన భూముల్లో ప్రత్యేక రుచి, సువాసనతో పీచు తక్కువగా ఉండి, ఎక్కువ గుజ్జుతో ఉండే బెనీషా రకం, చిన్న, పెద్ద రసాలు వంటి రకాలు పండుతున్నాయి.
వీటి రుచి, సువాసన, నాణ్యత కారణంగా కొల్లాపూర్ మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కూడా లభించింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ మరింత పెరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండే ఈ మామిడిపండ్ల రుచిని ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలూ ఆస్వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా), ఎగుమతి సంస్థలు కలిసి రైతులకు శిక్షణ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించడం వల్ల ఎగుమతుల ప్రక్రియ మరింత సులువైంది. ఈ ఏడాది సుమారు ఏడు వేల మెట్రిక్ టన్నుల వరకు కొల్లాపూర్ మామిడిపండ్లు విదేశీ మార్కెట్లకు వెళ్లే అవకాశం ఉందని ఎగుమతిదారుల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆర్గానిక్ పద్ధతిలో సాగు
కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోని రైతులు బంగినపల్లి, హిమాయత్, దసేరి వంటి వివిధ రకాల మామిడిపండ్ల తోటలను సాగు చేస్తున్నారు. పురుగు మందులు లేకుండా పూర్తి సేంద్రీయ ఎరువులతో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటున్నాయి. మామిడి పండ్లకు ఎలాంటి చీడపీడలు సోకకుండా ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతి ఫాలో అవుతున్నారు రైతులు. మామిడి పండ్లను శుద్ధి చేసి, ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. ఎగుమతుల వల్ల రైతులకు స్థానిక మార్కెట్‌తో పోలిస్తే మెరుగైన ధరలు లభిస్తున్నాయి. ‘‘తెలంగాణలో పండే కొల్లాపూర్ మామిడి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను ఆకర్షిస్తున్నాయి’’ అని ఉద్యానశాఖ మాజీ కమిషనర్ ఎల్. వెంకట్రామ్ రెడ్డి చెప్పారు.
ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా..
ఈ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు పెరగడం వల్ల ఉద్యాన రంగానికి కూడా కొత్త అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలతో పాటు మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీతో పండుతోన్న మామిడికి విదేశాల్లో మంచి డిమాండ్ వస్తోంది. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు, మార్కెటింగ్ సంస్థల సాయంతో చిన్న, మధ్య తరహా రైతులు కూడా తమ పంటను నేరుగా విదేశాలకు పంపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల వనపర్తి జిల్లా పెబ్బేర్‌కు చెందిన ఒక రైతు ‘మల్లిక’ రకం మామిడి పండ్లను ఎగుమతి చేయడం విశేషం.
‘‘రైతులు కొత్త యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన కాయలు వస్తాయని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధరలు సాధించొచ్చ’’ని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. వేణుగోపాల్ తెలిపారు.
యుద్ధం కారణంగా తగ్గిన ఆర్డర్లు
మన దేశం మామిడి ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు 43 శాతం మామిడి పండ్లు మన దేశంలోనే సాగవుతున్నాయి. 2024 -– 25వ సంవత్సరంలో 2.28 కోట్ల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్12వేల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసి అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. అయితే, ఇజ్రాయెల్– ఇరాన్ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో.. ఈ ఏడాది సీజన్‌లో విదేశాలకు వెళ్లే మామిడి ఎగుమతులు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పంపే ఎగుమతులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ నాణ్యమైన ఉత్పత్తి, గ్రేడింగ్, ప్యాకేజింగ్, కోల్డ్‌చైన్ సదుపాయాల వల్ల తెలంగాణ మామిడి పండ్లకు ప్రపంచ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో, రైతులకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే విదేశీ మార్కెట్లను మరింత విస్తరించడంపై రాష్ట్ర ప్రభుత్వం, అపెడా, ఉద్యానశాఖలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
కొల్లాపూర్ మామిడి ప్రత్యేకత
బంగారు వర్ణంలో మెరిసే కొల్లాపూర్ మామిడి.. ఒక్కోటి 200 నుంచి 500 గ్రాములు ఉంటుంది. మామిడి కాయలకు పురుగు పట్టకుండా, రంగు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతి అనుసరిస్తున్నారు.
రైతులే ఎగుమతి చేయొచ్చు..
‘‘రైతులు మామిడి పండ్లను ఎగుమతి చేయాలంటే.. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడంతో పాటు హార్టినెట్లో నమోదు చేయించుకోవాలి. కాయలకు ఫ్రూట్ బ్యాగింగ్ చేసి, ఎగుమతి చేసేందుకు వారి పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా తాము పండించిన పండ్లను విదేశాలకు ఎగుమతి చేయవచ్చ’’ని అపెడా అధికారి ఆర్పీ నాయుడు తెలిపారు.
బయ్యర్స్, సెల్లర్స్ సమావేశం
రాష్ట్రంలో మామిడి పండ్ల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ బయర్స్, సెల్లర్స్, ఎక్స్ పోర్టర్స్ సమావేశాలు నిర్వహించిందని జాయింట్ డైరెక్టర్ బి. బాబు చెప్పారు. ‘‘సేంద్రీయ సేద్యం, ఫ్రూట్ బ్యాగింగ్, రైతులకు తాము శిక్షణ ఇచ్చాం. మామిడిపండ్లను నేరుగా ఎలా ఎగుమతి చేయాలో కూడా అవగాహన కల్పించాం” అని ఆయన చెప్పారు. ‘‘ఇక్కడ అమ్మితే బాక్సుకు వెయ్యి రూపాయలు.. విదేశాలకు ఎగుమతి చేస్తే 4 వేల దాకా ఆదాయం వస్తుంది. ఎగుమతితోనే మామిడి రైతుల జీవితాలు బాగుపడతాయ’’ని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రైతులు చెప్పారు.
మంత్రి... మామిడి సాగు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగుల పల్లిలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన మామిడి వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల్లో బంగినపల్లి, సువర్ణ రేఖ, అల్ఫోన్సో, కేసర్, కొత్తపల్లి కొబ్బరి, తోతాపురి, వైట్ గులాబ్ , హిమాం పసంద్, మాల్వా వంటి ఇరవై రకాల మామిడి మొక్కలు వేసి ఆధునిక యాజమాన్య పద్ధతిలో నాణ్యమైన మామిడి పండించారు. తాను కూడా ‘మామిడిపండ్లను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేశాన’ని మంత్రి తుమ్మల చెప్పారు.
ఎగుమతులకు 38 కోట్లతో ప్రాజెక్టు!
రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ద్వారా మామిడి రైతులకు సాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే పెద్ద కొత్తపల్లి మండలం కార్పాముల దగ్గర మామిడి పండ్ల గ్రేడింగ్, వాషింగ్, ప్యాకింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌లను అందుబాటులోకి తెస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాగా, అంతర్జాతీయ నియమాల ప్రకారం పండ్లకు వేడి నీటి చికిత్స (హాట్ వాటర్ ట్రీట్‌మెంట్), రేడియేషన్ ప్రక్రియలను చేయాల్సి ఉంటుంది.
ఇవేకాకుండా తెలంగాణ మామిడిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేయడానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.38 కోట్ల బడ్జెట్‌తో ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ యంత్రం, వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, కోల్డ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, బాటసింగారం పండ్ల మార్కెట్‌తో పాటు కోహెడ అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యాధునిక ప్యాక్‌హౌస్‌లను నిర్మించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.
