TRSలోకి కొల్లాపూర్ కాంగ్రెస్ MLA హర్షవర్ధన్ రెడ్డి

TRSలోకి కొల్లాపూర్ కాంగ్రెస్ MLA హర్షవర్ధన్ రెడ్డి

హైదరాబాద్ : నందినగర్ లోని తన ఇంట్లో కాంగ్రెస్ నేత, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డితో సమావేశం అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేతో టీఆర్ఎస్ లో చేరికపై చర్చించారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని హర్షవర్ధన్ రెడ్డి .. కేటీఆర్ తో చెప్పారు.

కాంగ్రెస్ ను వీడి… టీఆర్ఎస్ లో చేరడంపై ప్రెస్ నోట్ విడుదల చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వం లోనే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ది చెందుతుందని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. నియోజక అభివృద్ది కోసమే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగాలు, సోమశిల – సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు – రంగారెడ్డి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపు లాంటి హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నాననీ.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని  హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు.