ఆస్తులపై చర్చకొస్తావా?

ఆస్తులపై చర్చకొస్తావా?

సంస్థాన్ నారాయణపురం, వెలుగు : 2014 తర్వాత ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అంటూ మంత్రి జగదీశ్ రెడ్డికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడున్నరేండ్లుగా అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించినా.. ఏనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తాను రాజీనామా చేయగానే వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్ట్  పేరుతో వేల కోట్ల కమీషన్​ కేసీఆర్​ కుటుంబానికి అందిందని ఆరోపించారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ 
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దని.. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని టీఆర్ఎస్ లోకి  తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖకు బదులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు నిధులు తీసుకెళ్తుంటే  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ మంత్రి జగదీష్ రెడ్డి అని విమర్శించారు. 

ప్రజా సేవ కోసం ఆస్తులు అమ్ముకున్న..
2009 తర్వాత ప్రజా సేవ కోసం తన ఆస్తులు అమ్ముకున్నానని, అదే జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. 21న మునుగోడులో జరిగే బహిరంగ సభలో తనతో పాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు రూ.8 లక్షలు అందజేశారు. నారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బీజేపీలో చేరారు. మీటింగ్​లో బీజేపీ రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, నాయకులు జక్కల విక్రమ్ యాదవ్, గుత్తా శ్రీధర్ రెడ్డి, కోన్ రెడ్డి నరసింహ, కరంటోతూ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ సంజీవ, తదితరులు పాల్గొన్నారు.