- పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలి
- బీసీ జన సభ, యాదవ, ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్
- ఈ నెల 5న చలో ఎల్లమ్మగూడెం, 10న చలో గన్ పార్క్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని బీసీ జన సభ,యాదవ, ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్‌చేశాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా సర్పంచ్‌గా నామినేషన్ వేసినందుకు నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడానికి చెందిన యాదగిరి యాదవ్‌ను నకిరేకల్‌లో కిడ్నాప్‌చేసి చిత్రహింసలు పెట్టారని, చంపుతామని బెదిరించారన్నారు. గతంలోనూ చెరుకు సుధాకర్, పున్నా కైలాష్ నేతపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటువంటి దాడులే చేశారన్నారు.
బీసీ సమాజం ఏకమై కోమటిరెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. బాధితులకు రక్షణ కల్పించాలని, కిడ్నాప్‌చేసిన కోమటిరెడ్డి అనుచరుడు, రౌడీషీటర్ సందీప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడికి నిరసనగా ఈ నెల 5న చలో ఎల్లమ్మగూడెం, కోమటిరెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ 10న చలో గన్ పార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యాదవ హక్కులు పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, జాతీయ కార్యదర్శి రమేశ్, బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు వోరగంటి వెంకటేశ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి లొడంగి గోవర్ధన్, బీసీ కుల సంఘాల అధ్యక్షుడు కాటం నర్సింహ, బేరి రామచంద్రయ్య, కొమ్మనబోయిన సైదులు పాల్గొన్నారు.
