దానంకు రెండు లక్షల మెజారిటీ ఖాయం:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దానంకు రెండు లక్షల మెజారిటీ ఖాయం:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • దానంను గెలిపించే బాధ్యత మాది
  • రెండు లక్షల మెజార్టీ ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
  • 6న తుక్కుగూడ సభను సక్సెస్ చేయాలి
  • లీడర్లు, కార్యకర్తలు కలిసి ముందుకెళ్లాలని సూచన

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్​ను గెలిపించే బాధ్యత తమదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకుంటామని తెలిపారు. 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్​గా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో అంజన్​కుమార్ యాదవ్ రెండు సార్లు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారని, ఈసారి దానం నాగేందర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్​లోని మంత్రి నివాసంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 6న నిర్వహించనున్న తుక్కుగూడ జనజాతర మహాసభపై పార్టీ నేతలతో చర్చించారు. తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘దానం నాగేందర్​కు పార్టీ నేతల, కార్యకర్తల బలం ఉంది. దానం గెలిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ డెవలప్ అవుతాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను మనసులో పెట్టుకోకుండా కార్యకర్తలంతా కలిసి పని చేయాలి. 8 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ప్రారంభిస్తాం’’అని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తామన్నారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి మేనిఫెస్టోను తుక్కుగూడ సభా వేదికగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రిలీజ్ చేస్తారని తెలిపారు. 

కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘దేవుడి పేరుతో కాళేశ్వరం కట్టి అవినీతికి పాల్పడ్డరు.. దేవుడి గుడి కట్టిన యాదగిరిగుట్టలో కూడా డబ్బులు దోచుకున్నారు. కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ వ్యాపారం చేస్తే.. కొడుకేమో మంది ఫోన్లు వింటూ ట్యాపింగ్​కు పాల్పడ్డడు. ఇవన్నీ దేవుడు చూసి తట్టుకోలే.. అందుకే.. గత వానా కాలంలో వర్షాలు సక్కగ పడలేదు’’అని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వర్షాలు పడక కరువు వస్తే మధ్యలో కాంగ్రెస్ ఏం చేసిందని మండిపడ్డారు. కేటీఆర్.. కల్వకుంట్ల ట్యాపింగ్ రావుగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. 4 కోట్ల మందిని బాధపెట్టి.. 4 కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇంతలా దిగజారలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మూసీ నది గురించి ఏనాడూ పార్లమెంట్​లో మాట్లాడలేదని మండిపడ్డారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు అజారుద్దీన్, రోహిణ్ రెడ్డి, ఆదం సంతోష్ కుమార్, ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి, కోట నీలిమా, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.