పదెకరాల భూమిలేని నీకు వేల కోట్లు ఎక్కడివి? : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పదెకరాల భూమిలేని నీకు వేల కోట్లు ఎక్కడివి? : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • తెలంగాణ ఉద్యమం గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసినవ్?
  • ఎవరు త్యాగం చేస్తే రాష్ట్రం వచ్చిందో తెలుసా?
  • నేను ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు నిక్కరేసుకున్నవ్
  • మంత్రి పదవినే వదులుకున్న నన్ను కోవర్ట్ అంటవా? 
  • కోమటిరెడ్డి అంటే నిజాయితీ.. కల్వకుంట్ల అంటే కమీషన్లని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, ఆయన తన స్థాయిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ‘‘కేటీఆర్.. నీకు తెలంగాణ అంటే తెలుసా? ప్రత్యేక రాష్ట్రం ఎలా వచ్చిందో తెలుసా? ఎవరెవరు ప్రాణ త్యాగానికి సిద్ధపడితే, ఎందరు ప్రాణ త్యాగం చేస్తే వచ్చిందో తెలుసా?” అంటూ నిలదీశారు. కేటీఆర్ వాడే భాష ఏంది, పద్ధతి ఏందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌‌‌‌‌‌‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఓ ప్రకటనలో వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పందించారు. ‘‘తెలంగాణ కోసం మొదట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న నాయకుడు ఎవరో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలుసా? ఒకవేళ ఆయనకు తెలియకపోతే తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అని చెప్తడు” అని అన్నారు.

ఎవరు కోవర్టో ప్రజలకు తెలుసు
‘‘సాగర హారంలో నన్ను తాకిన బుల్లెట్‌‌‌‌‌‌‌‌ను అడుగు. నాడు నా వెంట నడిచిన లక్షలాది జనాన్ని అడుగు. రాష్ట్రంలో ఎవరు ప్రజా నాయకులో, ఎవరు ఎన్ని కోట్లు వెనకేసుకున్న కోవర్టో చెబుతారు” అని వెంకట్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నెత్తిన పెట్టుకున్న తెలంగాణ జనాన్ని నిండా ముంచి ఢిల్లీతో సెటిల్మెంటు చేసుకున్న కోవర్టులు ఎవరో చెప్పాలన్నారు. రోజూ ఈడీ రెయిడ్స్​, ఐటీ రెయిడ్స్​ఎవరి అనుచరుల కంపెనీల మీద జరుగుతున్నాయో, ఎవరు అరెస్ట్ అవుతున్నారో చెప్పాలని కేటీఆర్​ను నిలదీశారు. ఇన్ని జరుగుతున్నా ఆయన మీద ఈగ వాలదెందుకని ప్రశ్నించారు. దీన్ని బట్టి కేటీఆర్ ఎవరికి కోవర్టుగా మారాడో అర్థమైపోతున్నదన్నారు. ‘‘నువ్వు ఢిల్లీకి కోవర్టు కాదని ఒట్టేసి చెప్పే దమ్ముందా? ఢిల్లీకి కోవర్టుగా మారకపోతే కేటీఆర్ చేసే అవినీతి స్కామ్​లకి ఎప్పుడో జైల్లో ఉండేవారు. ప్రతి ప్రాజెక్టులోనూ కమీషన్లు బొక్కే కల్వకుంట్ల ఫ్యామిలీ మీది” అని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డిని అనడానికి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న స్థాయి ఏంటని ప్రశ్నించారు.

వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి?
‘‘ఎవరికి ఎక్కడ పేరొస్తుందో అని నల్గొండ జనానికి తాగు నీరు రాకుండా చేసిందెవరో మీ నాయనను అడుగు. మీ నాయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నేను ఫ్లోరైడ్ సమస్య మీద 13 రోజులు నిరాహార దీక్ష చేసిన. 40 ఏండ్లుగా ఈ సమస్య మీద ఏ నాయకుడూ చేయని పోరాటం చేసినా. ఆ సంగతి ఫ్లోరైడ్ బాధితులను అడుగు” అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ‘‘నీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకొని తెలంగాణ ఉద్యమ సారథిని, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నన్ను కోవర్టు అనటానికి సిగ్గులేదా” అని ప్రశ్నించారు. పదెకరాల భూమి లేని కేటీఆర్​కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. రాజకీయమంటే అధికారం అనుభవిస్తూ, కోట్ల అవినీతి చేయడం కాదని వెంకటరెడ్డి అన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే, విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయడం రాజకీయం కాదన్నారు. ఇన్నేండ్లలో ఏ ఒక్క అమరుడి ఇంటికైనా వెళ్లి ఉంటే నాయకుడంటే ఏమిటో కేటీఆర్​కు తెలిసేదన్నారు. ‘‘అసలు తెలంగాణ కోసం నువ్వు ఏం చేశావని నన్ను కోవర్ట్ అని అంటావ్. నువ్వు చదివింది అమెరికాలోనా, గుంటూరు గల్లీలోనా?’’ అని ప్రశ్నించారు.

ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో ఎంజాయ్ చేసే నీకెట్ల తెలుస్తది
‘‘నేను ఉద్యమం చేసిన రోజుల్లో నువ్వు నిక్కర్లేసుకొని ఆడుకుంటున్నావేమో.. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకుంటే నన్నే కోవర్ట్​ అంటావా? కోమటిరెడ్డి అంటే నిజాయితీకి మారుపేరు. కల్వకుంట్ల అంటే కమీషన్లకు మారుపేరు” అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. ‘‘నేను చేపట్టిన ఉద్యమం ఉప్పెనై రగిలితే తెలంగాణ వచ్చిందనే విషయం తెలియకపోతే తెలుసుకోవాలి. నా ఆమరణ దీక్ష భగ్నంతో రగిలిన జనం నేషనల్ హైవేలను దిగ్బంధిస్తే కానీ ఢిల్లీ తలవంచలేదనే విషయం ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ఎంజాయ్ చేసే నీకెలా తెలుస్తుంది?’’ అని వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎద్దేవా చేశారు.