మూడేండ్లలో రోడ్ల రిపేర్లన్నీ పూర్తి చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మూడేండ్లలో రోడ్ల రిపేర్లన్నీ పూర్తి చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • వచ్చే నెలలో హ్యామ్ రోడ్ల టెండర్లు
  • ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ట్రిపుల్ ఆర్ ను ఆమోదించాలని మరోసారి మోదీ, గడ్కరీని కోరుతామని వెల్లడి
  • అసెంబ్లీకి కేసీఆర్  వస్తే అన్ని అంశాలపై చర్చిస్తామని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే మూడేండ్లలో రోడ్ల రిపేర్లన్నీ పూర్తి చేస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తొలి దశ రోడ్ల మరమ్మతులకు సంబంధించి 5,190 కిలోమీటర్ల హ్యామ్  ప్రాజెక్టు టెండర్లను వచ్చే నెలలో పిలుస్తామన్నారు. వర్షాలు తగ్గగానే సెప్టెంబరులో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, మరమ్మతులు చేసిన తరువాత టోల్ గేట్లు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.6,500 కోట్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు.

గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ హెడ్డాఫీసులో హ్యామ్  రోడ్లపై ఈఎన్సీ, సీఈలు,ఎస్ఈలు, ఈఈలతో మంత్రి రివ్యూ చేపట్టారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ర్టవ్యాప్తంగా గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, గత పాలకులు రిపేర్లు  చేయలేదని మండిపడ్డారు. ‘‘ఎక్కువ డ్యామేజ్  అయినవి, ట్రాఫిక్  ఎక్కువ ఉన్న రోడ్లను తొలి దశలో హ్యామ్  పద్ధతిలో రిపేర్లు చేస్తున్నాం.

రోడ్  సేఫ్టీలో భాగంగా విజయవాడ, కామారెడ్డి రూట్ లో బ్లాక్ స్పాట్స్  మరమ్మతులు కూడా చేపడుతున్నామన్నారు. ప్రతినెలా రోడ్ల రిపేర్లు, ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ల పెడింగ్ బిల్స్ కు రూ.200 కోట్లు రిలీజ్  చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, రీజనల్ రింగ్  రోడ్డు నార్త్ పార్ట్ ను కేంద్ర కేబినెట్ లో ఆమోదించాలనే అంశంపై త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీని కలుస్తాం. 96 శాతం భూసేకరణ పూర్తయింది. రీజనల్  రింగ్  రోడ్  సౌత్ పార్ట్  అలైన్ మెంట్ ను ఇటీవల కేబినెట్ ఆమోదించింది. త్వరలో డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి అందిస్తం. కేంద్రమే ప్రాజెక్టు చేపట్టాలని కోరుతాం” అని వివరించారు.

కేటీఆర్, హరీశ్ ను లెక్కలోకి తీసుకోం

బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్  రావు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్  చేస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. ‘‘హరీశ్ రావు మాజీ మంత్రి. ఎమ్మెల్యే మాత్రమే. వాళ్ల పార్టీ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్  కూడా కాదు. ఏ హోదాలో అసెంబ్లీ నిర్వహించాలని అడుగుతాడు. ప్రతిపక్ష నేత  అసెంబ్లీకి వచ్చి అడిగితే అన్ని అంశాలపై చర్చిస్తాం. కేసీఆర్ వచ్చి  మా పనితీరులో తప్పులు ఉంటే చెప్పవచ్చు. సలహాలు ఇవ్వొచ్చు. తీసుకునేందుకు రెడీగా ఉన్నాం. కేటీఆర్, హరీశ్ రావును మేం పరిగణనలోకి తీసుకోం. వాళ్లు లెక్కలోకి రారు” అని మంత్రి చెప్పారు.