అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి
  • ప్రమాదాలకు ఆస్కారం ఉన్న రోడ్లు, బ్రిడ్జీలను గుర్తించి హెచ్చరిక బోర్డులు పెట్టాలి
  • ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్‌‌‌‌అండ్‌‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి ఆదేశించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌‌లో ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వాగులు, వంకలు పొర్లి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న రోడ్లు, బ్రిడ్జీలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచించారు. ఎర్రమంజిల్‌‌లోని ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని, జిల్లాల వారీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్‌‌‌‌అండ్‌‌బీ డివిజన్‌‌ల వారీగా తనకు రోజూ రిపోర్ట్ పంపాలన్నారు.

పురోగతిలో ఉన్న రోడ్లు, ఆర్వోబీ, ఆర్యూబీలపై ఆరా తీసిన మంత్రి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఫినిషింగ్ స్టేజ్‌‌లో ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి హ్యామ్ పనులకు అతి త్వరలో శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. గ్రామీణ స్థాయి నుంచి రహదారులు అభివృద్ధి చేయడం వల్ల పరిశ్రమలు వచ్చి, పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ వంటిదని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూసేకరణలో రాష్ట్ర వాటా కింద రూ. 626.87 కోట్లు ఇప్పటికే ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. వరంగల్‌‌, ఆదిలాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.