
చండూరు, నాంపల్లి, వెలుగు : కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసేందుకే పార్టీలు మారానని, తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చండూరులో నిర్వహించిన సీపీఐ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలనే బీజేపీకి వెళ్లానని, అక్కడ తాను అనుకున్నది జరగకపోవడంతో తిరిగి సొంతగూటికి వచ్చానని వివరించారు.
తాను ఏనాడూ కమ్యూనిస్టులను కించపరచలేదని... చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సీపీఎం తను చేసిన మోసంపై మాట్లాడానే తప్ప సీపీఐని విమర్శించలేదన్నారు. 2018లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ఈసారి కూడా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌కు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని కోరారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పని అయిపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ బలంగా మారిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్య, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పార్టీ సీనియర్ నాయకులు రత్నాకర్ రావు, సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు నాంపల్లి మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచి గడ్డి మల్లయ్య, మారగోని మల్లేశ్ ఆమనగంటి భిక్షం, నారబోయిన లింగయ్య నక్కనబోయిన లింగయ్య, జలగోని పెద్దయ్య, సత్యనారాయణ, తదితరులు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.