
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి మునుగోడులో గెలిచిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ని గద్దె దింపే వరకు కొనసాగుతుందన్నారు. కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. మునుగోడులో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా గొల్లకురుమలకు 1,58,000 చొప్పున అకౌంట్లో వేసి.. అకౌంట్ను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. గొల్లకురుమలకు మద్ధతుగా ఈనెల 14న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, చండూరులో డిగ్రీ కాలేజీ ఏర్పాటు సహా ఉదయసముద్రం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. ఉదయసముద్రం పూర్తి చేస్తే మునుగోడు మండలంలో 50వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి సూర్యాపేట నుంచి ప్రచారం చేపడతానని స్పష్టం చేశారు.