హైకమాండ్​పై విశ్వాసం ఉంది: రాజగోపాల్​రెడ్డి

హైకమాండ్​పై విశ్వాసం ఉంది: రాజగోపాల్​రెడ్డి
  • బీఆర్​ఎస్​పై పోరాడాలని చెప్పారు: రాజగోపాల్​రెడ్డి
  • అన్ని అంశాలపై చర్చించాం: ఈటల
  • ఢిల్లీలో కిషన్​రెడ్డితో కలిసి నడ్డాతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం దిశా నిర్ధేశం చేసిందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ దిశలో హైకమాండ్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, 100 శాతం అమిత్ షా, నడ్డా భరోసా ఇచ్చారని తెలిపారు. తమకు అధిష్టానంపై విశ్వాసం ఉందని చెప్పారు. తెలంగాణలో బీజేపి అధికారంలోకి రావడంపై అమిత్ షా చాలా పట్టుదలతో ఉన్నారని రాజగోపాల్​రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ హెడ్ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, మాజీ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డితో నడ్డా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ అంశాలపై నేతలు తమ సూచనలు, సలహాలను హైకమాండ్ ముందు ఉంచినట్లు తెలిసింది. భేటీ అనంతరం రాజ గోపాల్ రెడ్డి, ఈటల మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు కిషన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తనను నడ్డా పిలిచారని ఈటల చెప్పారు. అన్నీ అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు స్పష్టం ఆయన చేశారు. కాగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని హైకమాండ్​కు సూచించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించి, నిర్మోహటంగా, ముక్కుసూటిగా, ఎలాంటి సంకోచం లేకుండా హైకమాండ్​కు ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో దోపిడీ పాలన బీజేపీతోనే అంతమవుతుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఆ విషయంలో పార్టీ ఇంకా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందో చెప్పామన్నారు.