
సంగారెడ్డి జిల్లా : మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని ఐదు లక్షల అప్పుల కుప్పగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. ఏమి ఉద్ధరించడానికి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. పఠాన్ చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో స్వామి వివేకానంద క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు ఆయన జ్ఞాపిక, నగదు బహుమతిని అందజేశారు. కొడుకుకు సీఎం పదవిని కట్టబెట్టాలనే కుటుంబ ఒత్తిడి వల్లే బీఆర్ఎస్ పార్టీని నెలకొల్పి దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ అయిపోతుందని కామెంట్ చేశారు. ఒక శాసనసభ్యున్ని ఓడించడానికి వందమంది ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకు పోవడం ఖాయమన్నారు. గడిచిన 8 సంవత్సరాలలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు దోచుకొని దాచుకున్న సొమ్మునంత బీజేపీ బయటకు తీసి, వారికి శిక్షపడేలా చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పఠాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.