నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కు గౌరవం పెరుగుతది : ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కు గౌరవం పెరుగుతది : ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి
  •     చిట్‌‌చాట్‌‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజల్లో కాంగ్రెస్​కు, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుందని ఆ  పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. కానీ  తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరం’’ అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, సోమవారం అసెంబ్లీలో  సీఎం ఎదురుపడితే పలకరించుకున్నామని, అంతే తప్ప ఆయనతో ప్రత్యేకంగా ఎలాంటి భేటీ కాలేదని, ఏ విషయాలపై ఆయనతో చర్చించలేదన్నారు . మంగళవారం కూడా లంచ్ బ్రేక్ లో కేటీఆర్ కలిశారని, మాములుగానే మాట్లాడుకున్నామని చెప్పారు. 2018 లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచి,  మంచి మెజార్టీ సాధించినప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని తాను తప్పు పట్టానని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు.