ఆధారాలు చూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా

ఆధారాలు చూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • సభ విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు: రాజగోపాల్​రెడ్డి

మునుగోడు : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో తెలంగాణలో కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనకు తెరపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని మలుపు తిప్పుతుందని చెప్పారు. సోమవారం మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభను సక్సెస్ చేసిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శంఖం పూరించారని అన్నారు.

‘‘బీజేపీకి అమ్ముడుపోయానని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నరు. అలా మాట్లాడే వారు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి కాదు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాణి నిలబెట్టే వ్యక్తి” అని అన్నారు. మునుగోడు మెజార్టీ ప్రజల ఇష్టం మేరకే వారి సలహాతోని తాను రాజీనామా చేశానన్నారు. బీజేపీ సభకు లక్షకు పైగా జనం వచ్చారని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల పేరుతో అనుమతించకపోవడంతో 50 వేల మందికి పైగా రోడ్లమీద నిలిచిపోయారన్నారు. అనంతరం మర్రిగూడ, మునుగోడు మండలాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో పెద్దిటి బుచ్చిరెడ్డి, అనంతరాజు, సురేందర్ రెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, గజ్జల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.