కేసీఆర్‌‌‌‌.. లెక్కలు చెప్పుకుందాం రా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి

కేసీఆర్‌‌‌‌.. లెక్కలు చెప్పుకుందాం రా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి
  • కాళేశ్వరం లెక్కలు నువ్వు చెప్పు.. రెండేండ్ల లెక్కలు మేం చెబుతాం
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి సవాల్‌‌‌‌

యాదాద్రి, వెలుగు : ‘రెండేండ్ల నుంచి జీతం తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి మాత్రం వస్తలేడు.. పంచాయతీ ఎన్నికలు ముగియగానే బయటకొచ్చి.. రేపటి నుంచి ఇంకో లెక్క అన్నడు. కేసీఆర్‌‌‌‌.. అసెంబ్లీకి రా.. పదేండ్లుగా సంపాదించుకున్న లెక్కలు, మీ బిడ్డ అడిగిన ఆస్తి లెక్కలు. పదేండ్ల చేసిన అప్పులు, కాళేశ్వరం లెక్కలు నువ్వు చెప్పు... మా రెండేండ్ల పాలన లెక్కలు మేం చెబుతాం’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి సవాల్‌‌‌‌ విసిరారు. 

యాదాద్రి జిల్లా వలిగొండ నుంచి కాటేపల్లి వరకు నిర్మించిన రోడ్డును ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్​ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బావా, మరదళ్లు పరస్పరం విమర్శలు చేసుకుంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను బొంద పెట్టారని ఎద్దేవా చేశారు. కేబినెట్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ కలిగిన కేసీఆర్‌‌‌‌ నెలకు రూ. 5 లక్షల చొప్పున రెండేండ్లుగా రూ. కోటికి పైగా జీతం తీసుకున్నా.. ఒక్కసారి కూడా బయటకు రాలేదని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్‌‌‌‌కు కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు. కేసీఆర్‌‌‌‌ అసెంబ్లీకి వస్తారన్న నమ్మకం తనకు లేదని, వచ్చినా ఆయన ఏం చెబుతారని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఒక్క రేషన్‌‌‌‌ కార్డు, ఇల్లు ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ పేరు మార్చి, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై వచ్చే నెల ఐదు నుంచి ఉద్యమిస్తామని ప్రకటించారు. అంతకుముందు సుంకిశాలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.