నల్గొండ, వెలుగు: అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నల్లగొండ పట్టణంలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆస్పత్రి నిర్వహణలో, ఆరోగ్య శ్రీ అమలులో ప్రభుత్వంతోపాటు, తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. గురువారం నల్లగొండలో నూతనంగా నిర్మించిన సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెంటిలేటర్‌తో పాటు, క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆస్పత్రి మేనేజ్మెంట్కు అభినందనలు తెలిపారు. డయాలసిస్సేవలు కూడా ప్రారంభించడం వల్ల రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆసుపత్రి ఎండీ రాపోలు అనిల్ కుమార్, డాక్టర్ దివ్య మాట్లాడుతూగత ఆరేండ్లుగా పది పడకల సామర్ధ్యంతో పట్టణంలో సాయి నైసా ఆస్పత్రి నడిపిస్తున్నామని, అందరి సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు అబ్బగోని కవిత, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రేగెట్ట మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
