ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ ఒక్క సీటు గెల్వదు: కోమటిరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ ఒక్క సీటు గెల్వదు: కోమటిరెడ్డి
  •     111 జీవో రద్దుతో సీఎంకు 3లక్షల కోట్లు వస్తాయని ఆరోపణ
  •     పేపర్ల లీకేజీతో నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారని ఫైర్

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్వదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్​ పార్టీకి రాష్ట్రంలో 40 స్థానాల్లో అభ్యర్థుల్లేరని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్ఎస్సే గెలుస్తదని మంత్రి హరీశ్ చేసిన కామెంట్లపై వెంకటరెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో జరిగే ఎన్నికల ఖర్చు అంతా భరిస్తానని కేసీఆర్ చెప్తుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తదా? అని అనుకున్నం. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో వచ్చిన డబ్బులు కూడా సరిపోవని భావించాం. కానీ, అసలు సంగతి ఏమంటే 111 జీవో రద్దు ద్వారా కేసీఆర్ అక్రమంగా రూ.3లక్షల కోట్లు కూడపెట్టుకున్నాడు”అని వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల పేర్ల మీద బినామీ ఆస్తులు ఉన్నాయని, వాటి కోసమే 111 జీవో రద్దు చేశారని విమర్శించారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో 111 జీవో రద్దు చేయాలని కోరినం. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 111 జీవో రద్దు చేస్తే అవినీతి జరుగుతుందని చెప్పా రు. అందుకే జీవో రద్దును వ్యతిరేకించారు”అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు.

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు?

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటు న్నారో చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాం డ్ చేశారు. ‘‘నిరుద్యోగుల ఇండ్ల వద్దకు వెళ్లి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలి. ఆ తర్వాత ఉత్సవాలు జరుపుకోవాలి”అని వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇంటర్ పేపర్లు లీక్ చేశారని ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కారణంగా 30లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మా రిందని విమర్శించారు.