కేసీఆర్​ రిటైర్​ అయితే..  సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటరు: కోమటిరెడ్డి

కేసీఆర్​ రిటైర్​ అయితే..  సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటరు: కోమటిరెడ్డి
  • రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • సీఎం పదవి పైన వ్యామోహం లేదు
  • త్వరలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తం
  • పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్​లో చేరుతారని ఆశిస్తున్న

నల్గొండ, వెలుగు: కేసీఆర్​ రాజకీయాల నుంచి రిటైర్మెంట్​ తీసుకుంటే.. సీఎం కుర్చీ కోసం ఆ పార్టీలో చాలా మంది కొట్టుకుంటరని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్​ స్టార్ట్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, సంతోష్, కవిత, హిమాన్షుతో సహా ఎల్లారావు, పుల్లారావు, రవీందర్​రావు లాంటి వాళ్లు సీఎం సీటు కోసం కొట్టుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, కర్నాటక ఫలితాలే ఇక్కడ కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకే తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీలో ఎలాంటి గ్రూపులులేవని, అందరం కలిసికట్టుగానే ఉన్నామని ఆయన తెలిపారు.

20 నియోకజకవర్గాల చొప్పున త్వరలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీనియర్లు పర్యటిస్తారని, కాంగ్రెస్ గెలుపునకు పాటు పడతామని చెప్పారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం ఆ పార్టీలో పది మంది పోటీ పడడం ఖాయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఆయన విరుచుకుపడ్డారు. మూడు పార్టీలు మారి, క్యారక్టర్​ లేని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఆయన ఆస్తులు రూ.5వేల కోట్లు అని, బీవెల్లంలో తనకున్న ఐదు ఎకరాలు రాసిస్తానని.. నల్గొండలో గుత్తా ఉంటున్న ఇల్లు నాకు ఇవ్వాలని చాలెంజ్​ చేశారు. నల్గొండలో ఇప్పటికీ అద్దె ఇంట్లో  ఉంటున్నానని, గుత్తా ఇల్లు ఇస్తే కనీసం అద్దె అయిన తప్పుతుందని అన్నారు. నా భార్య, బిడ్డ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. నల్గొండ, నకిరేకల్​నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు వీధికొకరు చొప్పున కొట్టుకుంటున్నారని విమర్శించారు. 

పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపా..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపానని, జూన్​ 2 లేదా ఆ తర్వాత గానీ వారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్​తో తాను మాట్లాడలేదని అన్నారు.