నేషనల్ ​ఎక్స్​ప్రెస్ హైవేగా హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారి : కోమటి రెడ్డి

నేషనల్ ​ఎక్స్​ప్రెస్ హైవేగా హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారి : కోమటి రెడ్డి
  • నేషనల్ ​ఎక్స్​ప్రెస్ హైవేగా హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారి
  •  సెప్టెంబర్​ నుంచి పనులు ప్రారంభిస్తాం
  •     ఐదు కోట్లతో కొర్లపాడ్ ​టోల్​గేట్​ వద్ద ట్రామా కేర్ ​సెంటర్​
  •     రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ (కేతేపల్లి), వెలుగు: హైదరాబాద్–-విజయవాడ జాతీయ రహదారిని నేషనల్ ఎక్స్ ప్రెస్​హైవేగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. సోమవారం కేతేపల్లి మండలం కొర్లపాడ్​టోల్​గేట్ వద్ద రూ.5 కోట్లతో ట్రామా కేర్​సెంటర్​నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జీఎమ్మార్ టోల్ వసూలు ఆపేశామని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి జాతీయ రహదారిని ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేందుకు ఆమోదం తీసుకున్నామని  తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తామన్నారు.

 అయితే, జాతీయ, రాష్ట్ర రహాదారుల పైన జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే సీఎస్సార్ ఫండ్స్​ కింద కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి ఏడీపీ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న సెంటర్ ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.50 వేల కోట్లతో మాసీ ప్రక్షాళన చేపడ్తామని, ఆగస్టు 15 నుంచి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని మంత్రి వివరించారు. రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ హరిచందన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు రక్షించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని ద్వారా 60 శాతం నుంచి 70 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.