గత పాలకుల స్వార్థంతో ఇంజినీర్లకు చెడ్డ పేరు : మంత్రి కోమటిరెడ్డి

గత పాలకుల స్వార్థంతో ఇంజినీర్లకు చెడ్డ పేరు : మంత్రి కోమటిరెడ్డి
  • వాళ్లు కట్టిన ప్రాజెక్టులు కొన్నేండ్లకే కూలినయ్: మంత్రి కోమటిరెడ్డి
  • కొత్త ఏఈఈలకు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్​లో మంత్రి  

హైదరాబాద్, వెలుగు: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ జంగ్ బహదూర్ వంటి ఇంజినీర్లను ఆదర్శంగా తీసుకోవాలని.. కాళేశ్వరం ఇంజినీర్లను కాదని కొత్త ఏఈఈలకు ఆర్అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయి ఆర్అండ్ బీకి అలాట్ అయిన 156 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)లకు గురువారం హైదరాబాద్​లోని న్యాక్ లో ఐదు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్​ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత పాలకులు, కొంతమంది ఇంజినీర్ల స్వార్థంతో మొత్తం ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ కే చెడ్డ పేరు వచ్చింది. వాళ్లు నిర్మించిన ప్రాజెక్టులు కొన్నేండ్లకే కూలిపోయిన య్. దీంతో మిగతా ఇంజినీర్ల ఆత్మస్థైర్యం దెబ్బ తిన్నది” అని అన్నారు. 

రాష్ట్ర ప్రగతిలో ఇంజనీర్లే కీలకం.. 

గత పదేండ్లలో తెలంగాణ విధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దాన్ని పునర్నిర్మిస్తున్నామని, ఇందులో ఇంజనీర్లు భాగమవ్వాలని కోరారు. ‘‘గత పదేండ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డట్టే.. ఆర్అండ్ బీ శాఖ కూడా ఇంజనీర్లు లేక ఇబ్బందులు పడ్డది. పది మండలాలకు ఒక్క ఇంజనీర్ కూడా అందుబాటులో లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నది. అందుకే ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన 1,540 మంది ఏఈఈలలో 156 మందిని ఆర్అండ్ బీకి కేటాయించాం.

ప్రస్తుతం ఆర్అండ్ బీ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రగతిలో కీలకమైన ట్రిపుల్ ఆర్, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరంతా నిబద్ధతతో పనిచేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు నిర్మించేది కేవలం రోడ్డో, బ్రిడ్జినో, భవనమో కాదు.. లక్షలాది మంది అవసరాలు తీర్చే ఒక కట్టడమన్న సంగతి గుర్తుపెట్టుకోండి.

అప్పుడే మీరు నాణ్యమైన నిర్మాణాలను చేపడతారు” అని అన్నారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఆర్అండ్ బీ సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్అండ్ బీ ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి, సీఈలు మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.