
- కొమురవెల్లి పాత రోడ్డులో అండర్పాస్
- వంద ఎకరాల వ్యవసాయ భూములకు రోడ్డు క్లోజ్
సిద్దిపేట/ కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి పాత కమాన్ రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలనే అధికారుల నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. మూడేళ్ల కిందట రైల్వే లైన్ పనులు ప్రారంభించారు. వారం రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించి అండర్ పాస్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో కొమురవెల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ లో భాగంగా కొడకండ్ల నుంచి దుద్దెడ వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులను అధికారులు పూర్తి చేశారు. గత నెల చివరి వారంలో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా రైలును నడిపారు. కొమురవెల్లి పాత కమాన్ రోడ్డులో ఇప్పటికే లెవల్క్రాసింగ్ తో పాటు రైల్వే గేటును ఏర్పాటు చేశారు. గార్డ్ రూమ్ ను కూడా నిర్మించారు. రైల్వే ట్రాక్ పనులన్ని పూర్తయిన తర్వాత ఆఖరి నిమిషంలో పాత కమాన్ రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలనే నిర్ణయం ఇప్పుడు చర్చానీయాంశగా మారుతోంది. ఇదిలా ఉండగా కొమురవెల్లి నుంచి పాత కమాన్ వరకు అయిదు కిలోమీటర్ల మేర డబుల్రోడ్డు పనులు ఇటీవల స్టార్ట్ అయ్యాయి.
ఆఖరి నిమిషంలో డిసీషన్..
కొమురవెల్లి పాత కమాన్ రోడ్డులో అండర్ పాస్ ను నిర్మించాలనే నిర్ణయం ఆఖరి నిమిషంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో కొమురవెల్లికి ఈ మార్గం గుండా భారీ సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని, భవిష్యత్తులో ఈ లైన్ ను విస్తరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అండర్ పాస్ ను నిర్మించాలని భావించారు. కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తుంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అండర్ పాస్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
పది మీటర్ల వెడల్పుతో అండర్ పాస్
కొమురవెల్లి పాత కమాన్ రోడ్డులో ప్రస్తుతం నిర్మించిన లెవల్ క్రాసింగ్ రైల్వే లైన్ కింది నుంచి పది మీటర్ల వెడల్పు 20 మీటర్ల ఎత్తుతో అండర్ పాస్ ను నిర్మించనున్నారు. ప్రస్తుతం పాత రోడ్డు 5.5 మీటర్లు ఉండగా దీన్ని విస్తరించి రైల్వే ట్రాక్ కు రెండు వైపులా దాదాపు రెండు వందల మీటర్ల పొడవుతో అండర్ పాస్ ను నిర్మించి పాత రోడ్డు కు కలపడానికి ప్రణాళికను రూపొందించారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆందోళనలో రైతులు
అండర్ పాస్ నిర్మాణంతో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న వ్యవసాయ భూముల రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతిపత్రం సమర్పించారు. వారి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అండర్ పాస్ నిర్మాణం వల్ల దాదాపు 60 మంది రైతుల వ్యవసాయ భూములుకు తొవ్వ లేకుండా పోతుంది.
భూముల ధరలు తగ్గుతున్నయ్..
కొమురవెల్లి పాత కమాన్ రోడ్ ల నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి నడిమిట్ల నుంచి రైల్వే లైన్ను నిర్మిస్తుర్రు.. దీని కోసం నా రెండెకరాల భూమిని గవర్నమెంటోల్లు తీసుకున్నరు. రైల్వే ట్రాక్ కు రెండు దిక్కుల ఉన్న నా అయిదెకరాల భూమికి తొవ్వ లేకుండా అయితది. అండర్పాస్చేయవట్టి మా భూముల ధరలు కూడా తగ్గుతున్నయ్.
– సార్ల అంజయ్య, రైతు, కొమరవెల్లి
వ్యవసాయ భూములకు రోడ్డు బంద్
అండర్ పాస్ నిర్మిస్తే చాలా మంది రైతుల భూములకు పోయేందుకు తవ్వ లేకుండా అయితది. ఇప్పటికే రైల్వే లైన్ కోసం భూములిచ్చి మస్తు లాసైనమ్. మళ్ల గీ అండర్ పాస్ కడితే లాస్ఇంకా ఎక్కువైతది. గీ సుద్ది మీద చాలాసార్లు పెద్ద సార్లను కలిసినం. ఏ సార్ కూడా న్యాయం చేస్తమని అంటలేడు.
– మేడికుంట శ్రీనివాస్, రైతు, కొమురవెల్లి
అండర్ పాస్ నిర్మాణానికి ఆమోదం
కొమురవెల్లి పాత కమాన్ రోడ్డులో అండర్ పాస్ నిర్మాణానికి అధికారులు ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో కొమురవెల్లికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో లెవల్ క్రాసింగ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనే అండర్ పాస్ ను నిర్మిస్తున్నాం.
–జనార్ధన్, రైల్వే ఇంజనీర్