అన్యాయాన్ని ఎదిరిస్తేనే న్యాయం జరుగుతుంది

అన్యాయాన్ని ఎదిరిస్తేనే న్యాయం జరుగుతుంది

హనుమకొండ సిటీ, వెలుగు: అన్యాయాన్ని ఎదిరించినప్పుడే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. యువత అన్యాయం, అక్రమాలను ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ సినిమా ప్రీ రిలీజ్​ఈవెంట్​ను హనుమకొండ హంటర్​ రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్స్​లో శనివారం సాయంత్రం గ్రాండ్​గా నిర్వహించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితోపాటు నిర్మాత సుష్మిత పటేల్, డా.అభిలాష్, శ్రేష్ఠ పటేల్, హీరో త్రిగుణ్, హీరోయిన్​ఈరా మోర్, జబర్దస్త్​ ఫేమ్ ​రామ్​ప్రసాద్​ హాజరయ్యారు. ఈవెంట్​ యాంకర్​గా సుమ వ్యవహరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, ఈవెంట్​కు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి హాజరు కాకుండా కుట్రలు చేశారన్నారు. ప్రభుత్వం దౌర్జన్యాలు, అణచివేతకు పాల్పడుతోందన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్టే అక్రమాలు, అన్యాయాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాత కొండా సుష్మిత పటేల్​ మాట్లాడుతూ అణచివేత ఎట్లుంటదో ‘కొండా’ సినిమాలో కనిపిస్తుందని చెప్పారు. కొండా మురళి మాట్లాడుతూ సమాజంలో ఎలా ఉండాలో ఆర్​కే నేర్పించాడని, ప్రతి ఒక్కరూ సమాజం గురించి కొంత సమయమైనా ఆలోచించాలన్నారు. డైరెక్టర్​ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారుల అణచివేతకు గురైన కొండా మురళి నిజజీవితమే మూవీలో చూపించామన్నారు.  సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.