హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చే పురుషోత్తమపట్నం గ్రామంలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాల భూములను అక్రమ కట్టడాల నుంచి కాపాడాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే అక్కడి నుంచి పంపించాలని కోరుతూ శనివారం ఆమె ఏపీ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రాంనారాయణరెడ్డికి లేఖ రాశారు.
1878, అక్టోబర్ 12న శ్రీరామ భక్తుడైన సోమరాజు పురుషోత్తమ దాసు తనకున్న 917 ఎకరాల భూమిని రిజిస్టర్డ్ వీలునామా ద్వారా భద్రాచలం స్వామికి బహూకరించారని తెలిపారు. నాటి నుంచి ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కులు అన్నీ దేవస్థానం పేరిటే ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఈ భూమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా (గతంలో తూర్పుగోదావరి/పోలవరం జిల్లా), ఎటపాక మండలం, పురుషోత్తమపట్నం గ్రామంలోని సర్వే నంబర్లు 1 నుంచి 101 వరకు విస్తరించి ఉందని పేర్కొన్నారు.
ఇందులో దాదాపు 889.50 ఎకరాల భూమి కాలక్రమేణా పలువురి చేతుల్లో ఆక్రమణలకు గురైందని, ఈ భూములపై ఎండోమెంట్ ట్రిబ్యునల్, స్థానిక కోర్టులతోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆలయానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. 2022, నవంబర్ 7న హైకోర్టు ‘రాష్ట్రీయ వానరసేన’దాఖలు చేసిన పిల్, దేవస్థానం దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై ఉమ్మడి తీర్పునిస్తూ, ఆక్రమణదారులను గుర్తించి ఆ భూములను రక్షించాలని అధికారులను ఆదేశించిందన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల సెంటిమెంట్లు, ప్రజా ప్రయోజనార్థం ఏపీ మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. పోలవరం కలెక్టర్, పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసి, స్వామివారి ఆస్తులను కాపాడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
