ఆ సీట్లు జనసేనకు ఇస్తే.. నా దారి నేను చూస్కుంట: కొండా విశ్వేశ్వర్రెడ్డి

ఆ సీట్లు జనసేనకు ఇస్తే.. నా దారి నేను చూస్కుంట: కొండా విశ్వేశ్వర్రెడ్డి
  • పార్టీ కేడర్​కు అన్యాయం చేయొద్దు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • శేరి​లింగంపల్లి, తాండూర్ సీట్లు  బీజేపీకి కేటాయిస్తే గెలుస్తాం
  • లేదంటే రాజీనామా చేస్తానంటూ ఢిల్లీ పెద్దలకు అల్టిమేటం

హైదరాబాద్, వెలుగు: శేర్​లింగంపల్లి, తాండూర్ సీట్లు జనసేనకు ఇవ్వొద్దని, అలా చేస్తే తన దారి తాను చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ లీడర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ ఢిల్లీ పెద్దలకు పరోక్షంగా హెచ్చరికలు పంపించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శేరి​లింగంపల్లి టికెట్ బీజేపీ తరఫున రవి కుమార్ యాదవ్​కే ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత కోసం బీజేపీ కేడర్ ఎంతో శ్రమించిందని ఢిల్లీ పెద్దలకు వివరించినట్లు సమాచారం.

తాండూర్, శేరి​లింగంపల్లి స్థానాలను గెలిపించుకునేందుకు లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. ఈ టైమ్​లో పొత్తులో భాగంగా ఈ సీట్లను జనసేనకు ఇస్తే.. పార్టీ కేడర్ మనోభావాలు దెబ్బతింటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇన్నేండ్లు పార్టీ కోసం కార్యకర్తలు పడ్డ కష్టం వృథా అవుతుందని చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు భరించే స్థితిలో లేరని, బీజేపీ పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తుందని పార్టీ అధినాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం.

బీజేపీ కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ సీట్లను జనసేనకు ఇస్తే.. పార్టీలో తాను కొనసాగలేనని, రాజీనామా చేసి వెళ్లిపోతానని తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది.