ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. అంజన్న ఆలయానికి నీతి అయోగ్ దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కింది. అందుకు సంబంధించిన వివరాలు వెల్లంచారు నీతిఆయోగ్ సభ్యులు. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాల విశేషాలతో రూపొందిన గ్రంథంలో తెలంగాణలోని ప్రముఖ ఆలయం చోటు దక్కడం గమనార్హం.
దేశ, విదేశీ పర్యాటకులకు అవగాహన కల్పించే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. పలు రాష్ట్రాల ప్రముఖ క్షేత్రాలను మాత్రమే ఎంపిక చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో ఉంది కొండగట్టు ఆంజనేయుడి గుడి. ఈ దేవాలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవుల్ని మేపుతుంటాడు. ఒక ఆవు మందలోంచి తప్పిపోతుంది. ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు. ఎండలో తిరిగి అలిసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి ‘నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది’ అని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో, అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట.
రెండు ముఖాలతో...
ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే... ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో కనిపిస్తాడు. అంతేకాదు ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్... ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు (చైత్ర , వైశాఖ మాసాల్లో) జరుగుతుంది. ఈ ఏడాది (2024) చైత్రమాసంలో ఏప్రిల్ 23న వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇంకా ఈ దేవాలయం ప్రత్యేకతలు ఏంటంటే... ఈ గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు చెక్కి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి, తలానీలాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న బేతాళ స్వామికి కోళ్లు, మేకలు కోసి, కల్లు సాక పోసి మొక్కులు చెల్లిస్తారు భక్తులు. పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళ్తారు.

