కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు.. లెక్క తేలని వెండి, బంగారం వివరాలు

కొండగట్టు హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు.. లెక్క తేలని వెండి, బంగారం వివరాలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. 81 రోజులకు సంబంధించిన 12 హుండీలు లెక్కించగా రూ.1,08,72,591 నగదు, 55 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. కాగా, భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలను లెక్కించలేదు. 

ఈ ఏడాది మే 30, జులై 23న హుండీ లెక్కించి, మిశ్రమ బంగారం, వెండి కానుకలను అధికారులు ముల్లెలు కట్టి తిరిగి హుండీలోనే భద్రపరిచారు. సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో కూడా అలాగే చేశారు. ఆరు నెలల్లో మూడు సార్లు హుండీ లెక్కించినప్పటికీ, బంగారు, వెండి కానుకలను లెక్కించకపోవడంపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయమై ఆలయ ఈవో శ్రీకాంత్ రావును వివరణ కోరగా.. ఎండోమెంట్ శాఖలో జువెలరీ వెరిఫికేషన్  ఆఫీసర్  ఒక్కరే ఉన్నారని, అతనిని పిలిపించి ఆభరణాలను తూకం వేసి వాటి విలువను తెలియజేస్తామని చెప్పారు.