కేసీఆర్​ నిధులు ఇస్తలేడు.. హరీశ్​రావు పట్టించుకుంటలేడు!

కేసీఆర్​ నిధులు ఇస్తలేడు.. హరీశ్​రావు పట్టించుకుంటలేడు!
  • కొండపాక బీఆర్ఎస్ ఎంపీటీసీల ఆవేదన
  • స్పందించకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిక

కొండపాక, వెలుగు: నాలుగేండ్లుగా సీఎం కేసీఆర్​తమకు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదంటూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని అధికార పార్టీ ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ సుగుణ దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ సమావేశంలో నిధులు కేటాయించాలని కోరుతూ ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయి బాబా గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు ప్రత్యేకంగా ఎలాంటి ఫండ్స్​ లేకపోవడం దారుణమన్నారు. 

తమ హక్కులను కాపాడుకోవడానికి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తే మంత్రి హరీశ్ రావు ఆపారని, ప్రత్యేక నిధులు వెంటనే కేటాయిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కనీసం మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా కూడా చూడడం లేదని వాపోయారు. చిన్నచిన్న పనులు చేద్దామన్నా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిధులు కేటాయించాలంటూ ఎంపీపీ సుగుణ కాళ్లు మొక్కారు. అనంతరం సాయిబాబాగౌడ్​సహా 8 మంది ఎంపీటీసీలు సమావేశాన్ని బాయ్​కాట్ చేశారు. సీఎం కేసీఆర్​స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు.