కోనో కార్పస్​  మొక్కలను తొలగించాలి : మిర్యాల ప్రకాశ్, చిట్యాల

కోనో కార్పస్​  మొక్కలను తొలగించాలి : మిర్యాల ప్రకాశ్, చిట్యాల

ఆరోగ్యానికి హాని కలిగించే కోనో కార్పస్ మొక్కలను ప్రభుత్వం తొలగించాలి. ఆ మొక్క నుంచి పొంచి ఉన్న హాని, ముప్పును ముందస్తుగా గుర్తించకపోవడం, హరితహారం కార్యక్రమంలో ఏటా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాటడంతో కోనో కార్పస్​ మొక్కలు పెరిగి పెద్దగవుతున్నాయి. ఈ మొక్కల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పలు జిల్లాల్లో ఈ మొక్కలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాలతోపాటు మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లలో డివైడర్లు మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా ఈ మొక్కలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.

చూడడానికి పచ్చగా, అందమైన ఆకారంలో పెరిగే ఈ మొక్కల పుప్పొడితో శ్వాసకోశ వ్యాధులు వస్తాయని పలు దేశాల్లో వాటిని నిషేధించారు. ఈ చెట్లతో ఉపయోగం దేవుడెరుగు గానీ ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే వీటి తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రం మొత్తం చేపట్టాలి. నల్గొండ జిల్లా చిట్యాలలో రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన ఈ మొక్కలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పై స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఈ చెట్లను తొలగించడానికి ధైర్యం చేయటం లేదు. ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకొని కోనో కార్పస్​ మొక్కలను తొలగించాలి. - మిర్యాల ప్రకాశ్, చిట్యాల, నల్గొండ జిల్లా