ప్రధాని పర్యటనను అడ్డుకుంటం

ప్రధాని పర్యటనను అడ్డుకుంటం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను అష్టకష్టాల పాలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వచ్చినా తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోడీకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలని సూచించారు. లేకపోతే అవమానాలకు గురవుతారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల12న మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సింగరేణి ప్రాంతంలో ఈనెల 10వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 12న ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని చెప్పారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను అవమానపర్చేలా మాట్లాడిన గవర్నర్ తమిళిసై తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే రాజ్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.