Good Health: కొర్రల ఆహారం.. ఆరోగ్యానికి భేష్.. కొర్ర పులిహార..పకోడి.. సూపర్ టేస్ట్..

Good Health: కొర్రల ఆహారం.. ఆరోగ్యానికి భేష్.. కొర్ర పులిహార..పకోడి.. సూపర్ టేస్ట్..

శరీరానికి మేలు చేసే తృణ ధాన్యాల్లో 'కొర్రల'ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగులు.. లాగే వీటిని ఎక్కువగా తినేవారు. అయితే, తర్వాత కాలంలో కొర్రల వాడకం తక్కువైంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న చిరుధాన్యాలలో కొర్రలు ఆరవ స్థానంలో ఉన్నాయి. సెటారియా ఇటాలికా జాతికి చెందిన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామందికి వీటితో అన్నం వండుకోవడమే తెలుసు. అయితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే కొర్రలతో వెరైటీ వంటకాలు కూడా వండుకోవచ్చు. ఇప్పుడు కొర్ర పులిహార.. కొర్ర పకోడి ఎలా తయారు చేయాలో చూద్దాం. . .!

కొర్ర పులిహోర తయారీకి కావలసినవి

  • కొర్రలు : ఒక కప్పు
  • ఆవాలు: 1 టీస్పూన్​
  • జీలకర్ర: 1 టీస్పూన్
  • శెనగపప్పు :ఒకటిన్నర స్పూన్
  • ఎండుమిర్చి :4
  • పచ్చిమిర్చి :3
  • క్యారెట్ ముక్కలు :పావు కప్పు
  • కరివేపాకు: 2 రెబ్బలు
  • నూనె: 3 టేబుల్ స్పూన్లు
  • పసుపు :కొంచెం
  • ఉప్పు :తగినంత
  • పల్లీలు 3: టేబుల్ స్పూన్లు
  • నిమ్మరసం:2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:ముందుగా కొర్రలను అన్నంలావండుకోవాలి. పొడిగా వండిన కొర్రల  అన్నాన్ని పళ్లెంలో తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర, శెనగపప్పు, ఎండు మిర్చి, పల్లీలు, జీడిపప్పు వేసి వేగించుకోవాలి. తర్వాత పసుపు. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేగించాలి. ఈ తాలింపును చిన్న మంటపై ఉంచి... ఆరబెట్టుకున్న కొర్రల అన్నంలో వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం... సరిపడా ఉప్పు కూడా కలిపి పాన్ దించేస్తే కొర పులిహోర రెడీ.

కొర్ర రిబ్బన్ పకోడి తయారీకి కావలసినవి

  • కొర్రపిండి : 1 కప్పు
  • శెనగపిండి : 2 టీస్పూన్లు
  • పుట్నాల పిండి: 2 టీస్పూన్లు.
  • వాము: అర టీస్పూన్
  • కారం లేదా మిరియాల పొడి: టీస్పూన్
  • ఉప్పు :తగినంత
  • ఇంగువ: కొంచెం
  • నీళ్లు: కొంచెం

తయారీ విధానం:ఒక గిన్నెలో కొర్రపిండి, శనగపిండి, పుట్నాల పిండి, కారం లేదా మిరియాల పొడి, ఉప్పు, వాము, ఇంగువ, వెన్న వేసి బాగా కలపాలి. సరిపడా నీళ్లతో మురుకుల పిండిలా కలు పుకోవాలి ఇప్పుడు పాన్​లో నూనె వేడి చేసి మురుకుల గిద్దెలో రిబ్బన్ పకోడి ప్లేటు పెట్టుకు ని వత్తుకోవాలి. రెండువైపులా దోరగా వేయించి తీయాలి. మీడియం మంటపై పకోడి కాల్చు కుంటేమాడిపోకుండా ఉంటాయి. కొర్రపిండి. లేకపోతే కొర్రలు, శెనగపప్పు పుట్నాల పప్పు కలిపి దోరగా వేయించి పొడి చేసుకుంటే సరిపోతుంది.