
ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. నేడు (2025 జులై 13న) హైదరాబాదులో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. కొన్నాళ్లుగా అనారోగ్యం, వయోభారం సమస్యలతో బాధపడుతున్నారు కోట. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు లేనిలోటు ఇండస్ట్రీకి తీరని వెలితి అని సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
కోట.. తెలుగు భాషలోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 1978లో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో కోట తన అరంగేట్రం చేసాడు. 1985లో వచ్చిన విజయశాంతి ప్రతిఘటన మూవీతో మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమాతో తన నట నైపుణ్యతని చాటుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్‌లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన బహుముఖ ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
కోట శ్రీనివాసరావు అవార్డులు:
కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. అలాగే, కోట తన సినీ కెరీర్లో మరిన్ని గొప్ప అవార్డులు అందుకున్నారు.
నంది పురస్కారాలు:
ప్రతిఘటన(1985)
గాయం (1993)
తీర్పు (1994)
లిటిల్ సోల్జర్స్(1996)
నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)
నంది ఉత్తమ విలన్ - చిన్న (2000)
నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)
నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)
నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006)
చిత్రాలకు మొత్తం 9 నంది అవార్డులు గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఏకంగా 9 అవార్డులు గెలుచుకొని అందరికంటే ఎక్కువ అవార్డులు గెలుచుకున్న నటుడిగా నిలిచారు.
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారంతో పాటు మరికొన్ని ప్రైవేట్ సంస్థల అవార్డులు, రివార్డులు అందుకున్నారు.