
Ola Electric: గడచిన కొన్ని త్రైమాసికాలుగా ఈవీ టూవీలర్ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ వ్యాపారం దిగజారుతోంది. కంపెనీ అమ్మకాలు నెమ్మదించటంతో పాటు మార్కెట్లో వాటా విషయంలోనూ తొలి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతోంది. దీనికి తోడు మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం గత ఏడాదితో పోల్చితే రెండింతలైందని వెల్లడికావటం పెద్ద ప్రకంపనను సృష్టించింది.
దీంతో నేడు ఇంట్రాడేలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు 9 శాతం వరకు నష్టాన్ని చూసింది. అయితే 12.07 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర ఒక్కోటి ఎన్ఎస్ఈలో 5.56 శాతం నష్టంతో రూ.50.30 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. వాస్తవానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఒకపక్క తగ్గుతున్న అమ్మకాలతో పాటు మరోపక్క పెరుగుతున్న నష్టాలు ఈవీ స్టార్టప్ కంపెనీపై ఆందోళనలను మరింతగా పెంచుతోంది.
బ్రోకరేజ్ తాజా టార్గెట్..
ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ హౌస్ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓలా ఎలక్ట్రిక్ షేర్లను డౌన్‌గ్రేడ్ చేసింది. ఓలా షేర్లకు బ్రోకరేజ్ SELL రేటింగ్ అందించింది. ఇదే క్రమంలో కంపెనీ షేర్లకు రానున్న కాలంలో టార్గెట్ ధర రూ.30గా ఫిక్స్ చేసింది. గతంలో కంపెనీ షేర్లకు కోటక్ అందించిన టార్గెట్ ధర రూ.50 నుంచి ప్రస్తుతం మరింత తగ్గింపును ప్రకటించింది.
వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఐపీవో సమయంలో రూ.76 చొప్పున విక్రయించబడింది. కానీ ప్రస్తుతం కోటక్ దీనికి ఐపీవో రేటు కంటే 60 శాతం తక్కువకు టార్గెట్ ధరను అందించటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణంగా మారింది. అలాగే స్టాక్ 52వారాల గరిష్ఠ ధర రూ.157.53 కంటే టార్గెట్ ధర 80 శాతం తక్కువగా ఉంచబడింది. ప్రస్తుతం మార్కెట్లో ఓలా మెుబిలిటీ స్టాక్ ట్రాక్ చేస్తున్న 8 మంది నిపుణుల్లో నలుగురు షేర్లను కొనుగోలు చేయాలని సూచిస్తుండగా, ఇద్దరు హోల్డ్ రేటింగ్, ఇద్దరు సెల్ రేటింగ్ అందించటం గమనార్హం.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.