కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,264 కోట్లు

కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,264 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.14,096 కోట్లు

ముంబై:  కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్సాలిడేటెడ్​ నికర లాభం డిసెంబర్ క్వార్టర్​లో 6.75 శాతం వృద్ధితో రూ. 4,264.78 కోట్లకు చేరుకుంది. బ్యాంకు గత ఏడాది కాలంలో రూ. 3,995.05 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. స్టాండెలోన్​ ప్రాతిపదికన, ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుకు పన్ను తర్వాత లాభం రూ. 2,791.88 కోట్ల నుంచి రూ. 3,005.01 కోట్లకు పెరిగింది. అయితే ఇది సెప్టెంబర్ క్వార్టర్​లో వచ్చిన లాభం రూ. 3,190.97 కోట్ల కంటే తక్కువగా ఉంది.

మొత్తం ఆదాయం రూ.10,947 కోట్ల నుంచి రూ.14,096 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఖర్చులు రూ.3,751 కోట్ల నుంచి రూ.4,284 కోట్లకు పెరిగాయి. రిపోర్టింగ్ క్వార్టర్​లో మొత్తం కేటాయింపులు రూ. 148.83 కోట్ల నుంచి రూ. 579.14 కోట్లకు పెరిగాయి. ఇది లాభంపై ప్రభావం చూపింది. గ్రాస్​ఎన్​పీఏలు 1.72 శాతం నుంచి 1.73 శాతానికి పెరిగాయి. ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్​లో తన పెట్టుబడుల కోసం రిపోర్టింగ్ క్వార్టర్​లో  రూ.190.13 కోట్లు కేటాయించామని బ్యాంక్ తెలిపింది.