మెప్పించని కోటక్ బ్యాంక్.. నికర లాభం 14 శాతం డౌన్​

మెప్పించని కోటక్ బ్యాంక్.. నికర లాభం 14 శాతం డౌన్​
  • నాలుగో క్వార్టర్లో రూ.3,552 కోట్లు
  • రూ.2.50 చొప్పున డివిడెండ్‌‌

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్  స్టాండలోన్ లాభం 2024-–25 జనవరి–-మార్చి క్వార్టర్లో 14 శాతం తగ్గి రూ.3,552 కోట్లకు చేరుకుంది. 2023–-24 చివరి క్వార్టర్లో రూ.4,133 కోట్ల లాభం వచ్చింది. బ్యాంక్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.16,712 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.15,285 కోట్లుగా ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. తాజా క్వార్టర్లో బ్యాంక్ రూ.13,530 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.12,307 కోట్లుగా ఉంది.

నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.6,909 కోట్ల నుంచి రూ.7,284 కోట్లకు పెరిగింది. ఏడాది లెక్కన ఇది 5 శాతం పెరిగింది. ఆస్తి నాణ్యతలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం అడ్వాన్సులలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏలు) గత సంవత్సరం మార్చి చివరి నాటికి 1.39 శాతం నుంచి నాలుగో క్వార్టర్లో 1.42 శాతానికి పెరిగాయి. అయితే, నికర అడ్వాన్సుల్లో నికర ఎన్​పీఏలు మార్చి 2025లో 0.31 శాతానికి   తగ్గాయి. ఇవి గత సంవత్సరం ఇదే కాలంలో 0.34 శాతంగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్​విధానంలో  బ్యాంక్ నికర లాభం గత సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5,337 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.4,933 కోట్లకు చేరుకుంది.

ఆదాయంలోనూ తగ్గుదల
మొత్తం ఆదాయం కూడా గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.27,907 కోట్లతో పోలిస్తే ఈసారి నాలుగో క్వార్టర్లో రూ.27,174 కోట్లకు తగ్గింది. 2024–-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి, బ్యాంకు లాభం స్టాండెలోన్​ ప్రాతిపదికన రూ.16,450 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం  రూ.13,782 కోట్ల లాభం వచ్చింది. ‘‘2025 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లాభం రూ.16,450 కోట్లకు పెరిగింది. ఇందులో కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌‌ను విక్రయించడం ద్వారా వచ్చిన లాభం రూ.2,730 కోట్లు కలిసి ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.13,782 కోట్లు ఉంది. ఏడాది లెక్కన19 శాతం పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పన్ను తర్వాత లాభం రూ.13,720 కోట్లుగా ఉంది" అని బ్యాంకు తెలిపింది.

ఈ సంవత్సరంలో నికరవడ్డీ ఆదాయం రూ.28,342 కోట్లకు పెరిగింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.25,993 కోట్లు ఉంది. ఏడాది లెక్కన 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి 2024 ఆర్థిక సంవత్సరం చివరిలో 20.55 శాతం నుంచి 22.25 శాతానికి పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2025 ఆర్థిక సంవత్సరానికి 4.96 శాతం, 2025  నాలుగో క్వార్టర్లో 4.97 శాతంగా ఉంది. మార్చి 31, 2025 తో ముగిసిన సంవత్సరానికి,  రూ.ఐదు ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.2.50 చొప్పున డివిడెండ్‌‌ను బ్యాంక్ బోర్డు సిఫార్సు చేసింది.