కేఆర్ఎంబీ పర్మిషన్​తోనే సాగర్​పై అడుగు పెట్టాలి

కేఆర్ఎంబీ పర్మిషన్​తోనే సాగర్​పై అడుగు పెట్టాలి
  • మీటింగ్ ​మినిట్స్​ రిలీజ్ చేసిన కృష్ణా బోర్డు
  • సాగర్​పై సీఆర్పీఎఫ్​ బలగాల పహారా కొనసాగుతుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ప్రాజెక్టు ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్, రిపేర్లు, పర్యవేక్షణ సహా ఏ పనులు చేపట్టాలన్న కేఆర్ఎంబీ పర్మిషన్​ తీసుకోవాల్సిందేనని కృష్ణా బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్​బలగాల పహారా కొనసాగుతుందని తేల్చిచెప్పింది. శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగింతపై కేఆర్ఎంబీ చైర్మన్​ శివ్​నందన్​ కుమార్​చాంబర్​లో గురువారం నిర్వహించిన మీటింగ్​మినిట్స్​ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. జనవరి 17న జలశక్తి శాఖ సెక్రటరీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలపై జారీ చేసిన మినిట్స్​పై తెలంగాణ అభ్యంతరాలు తెలుపుతూ రాసిన లేఖను మినిట్స్​కు జత చేశారు.

ఏపీ భూభాగంలోని అన్ని ఔట్​లెట్లను బోర్డుకు అప్పగించడానికి అభ్యంతరం లేదని ఏపీ ఈఎన్సీ తెలిపారని, అదే సమయంలో తెలంగాణ భూభాగంలోని ఔట్​లెట్లను స్వాధీనం చేసుకోవాలని కోరారని తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ తమ రాష్ట్రంలోని పవర్​హౌస్​లను బోర్డుకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఎస్​జెన్కో అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారని వెల్లడించారు. ఒకవేళ కేఆర్ఎంబీకి ఆయా ప్రాజెక్టుల ఔట్​లెట్లను అప్పగిస్తే రెండు రాష్ట్రాల నుంచి వాటి నిర్వహణకు సమాన సంఖ్యలో సిబ్బందిని నియమించాలని, వారి జీతభత్యాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని సమావేశంలో చర్చించారు.

15 ఔట్​లెట్ల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరమో రెండు రాష్ట్రాలు వారం రోజుల్లోగా లెక్కతేల్చి బోర్డుకు సమాచారం ఇవ్వాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్​పై ఉన్న 15 ఔట్​లెట్లను పూర్తి స్థాయిలో అప్పగించాల్సిందేనని సమావేశంలో చైర్మన్​సూచించారని పేర్కొన్నారు. రెండు భారీ ప్రాజెక్టుల నిర్వహణను చూడాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్నదని, అందుకే రెండు ప్రభుత్వాలు రెగ్యులర్​గా బోర్డుకు ఫండ్స్​రిలీజ్​చేస్తామని హామీ ఇవ్వాలని సమావేశంలో చైర్మన్​ కోరారు.

ప్రాజెక్టులు ఇస్తామని ఒప్పుకోలే : రాహుల్​బొజ్జ

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తామని తాము ఒప్పుకోలేదని, మీడియా తప్పుగా ప్రజెంట్​ చేసిందని ఇరిగేషన్ ​సెక్రటరీ రాహుల్​ బొజ్జ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గెజిట్​జారీ చేసిన తర్వాత కామన్​ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఆనాటి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, అందుకు ముందస్తు షరతులు కూడా విధించిందని తెలిపారు.  

పది ఔట్​లెట్లు కేఆర్ఎంబీ నిర్వహణలోనే : ఈఎన్సీ మురళీధర్

శ్రీశైలం, సాగర్​ ప్రాజెక్టుల్లో తెలంగాణకు సం బంధించిన పది ఔట్​లెట్లు కేఆర్ఎంబీ నిర్వహ ణలోనే ఉంటాయని ఈఎన్సీ మురళీధర్​ తెలి పారు. శుక్రవారం జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేఆర్ఎంబీ మెంబర్​సెక్రటరీ, 2 రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉన్న త్రీ మెం బర్​కమిటీ ఆయా ఔట్​లెట్ల నిర్వహణను మానిటరింగ్​చేస్తుందని తెలిపారు. తెలంగాణ భూభాగంలోని ఔట్​లెట్లను మన రాష్ట్రం సిబ్బందే నిర్వహిస్తారని, ఏపీ సిబ్బంది కూడా ఆ ఔట్​లెట్​పై విధుల్లో ఉంటారని తెలిపారు.