దేశంలో మూడో పెద్ద నది కృష్ణ

దేశంలో మూడో పెద్ద నది కృష్ణ

కృష్ణా నది దక్షిణ భారతదేశంలో ఒక అంతర్రాష్ట్ర నదిగా ప్రవహిస్తుంది. ఇది దేశంలో మూడో పెద్ద నది. ద్వీపకల్ప భారతదేశంలో గోదావరి తర్వాత రెండో పెద్దనది. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహబళేశ్వర్​ వద్ద 1337 మీటర్ల ఎత్తులో (సముద్ర మట్టానికి) జన్మించి పశ్చిమ నుంచి తూర్పుగా 1400 కి.మీ. పొడవున మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలోకి నారాయపేట జిల్లా మక్తల్​ మండలంలోని తంగడి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

ఇది తెలంగాణలో 612 కి.మీ. పొడవున మహబూబ్​నగర్​, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్​, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని మొత్తం పరివాహక ప్రదేశం 2,58,948 చ.కి.మీ. కర్ణాటకలో కృష్ణా నది ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమ, తుంగభద్ర. వీటిలో మలప్రభ మినహా మిగిలిన ఉపనదులన్ని కర్ణాటక, మహారాష్ట్రల్లో పరివాహక ప్రాంతం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కోడూరు సమీపంలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ నదిలో నీటి లభ్యత వల్ల కృష్ణా బేసిన్​లోని 75.6శాతం ప్రదేశం సాగులో ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే సాగుకు చాలా అనువైన పరివాహక ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ నది డెల్టాలో ఉన్న నేలలు దేశంలోని సారవంతమైన నేలలో ఒకటిగా నిలిచాయి. 

ప్రాజెక్టులు: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజీవ్​భీమా ఎత్తిపోతల పథకం, జవహర్​ నెట్టెంపాడ్​ ఎత్తిపోతల పథకం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, రాజోలిబండ మళ్లింపు పథకం, కోయిల్​ సాగర్​ ఎత్తిపోతల పథకం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గట్టు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, ఏఎంఆర్​ఎస్​ఎల్​బీసీ, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం. 

తెలంగాణలో ప్రవహించే నదులు 

గోదావరి, కృష్ణా, భీమ, మంజీర, ప్రాణహిత, తుంగభద్ర, వైన్​ గంగ, వార్ధా, ఎర్ర కాలువ, డిండి, మానేరు, మున్నేరు, మూసీ నది, పాలేరు, కడెం, పెన్​ గంగా, కిన్నెరసాని, తాలిపేరు నది.