- 180 గ్రామాలపై ప్రభావం.
- నీటి శాంపిల్స్ సేకరణ రిపోర్ట్ పై ఉత్కంఠ
సూర్యాపేట/మఠంపల్లి, వెలుగు: కృష్ణానదీ జలాల్లో వ్యర్థ రసాయనాలను ఎవరు కలిపారనే మిస్టరీ ఇంకా వీడలేదు. సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వయంభు మట్టపల్లి నర్సింహస్వామి ఆలయం కృష్ణా పరివాహక ప్రాంతంలో కొలువై ఉంది.ఈ నెల 4 న నదీ జలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థ రసాయనాలను నదిలోకి వదిలారు. పరిసరాలు తీవ్ర దుర్గంధం వస్తుండటంతో రసాయనాలు కలిసినట్లు గుర్తించారు.
వెంటనే ఆలయానికి ఉపయోగించే ఈ నీటి సరఫరాను నిలిపివేసి ఉన్నతాధికారులకు ఆలయ అధికారులు సమాచారం అందించారు. ఈ క్రమంలో నెల రోజులుగా తాగునీటి పై ప్రభావం ఏర్పడింది.
188 గ్రామాల తాగునీటి పై ప్రభావం
కృష్ణానది నుంచి వివిధ గ్రిడ్‌ల ద్వారా నీటి శుద్ధి చేసి జిల్లాలోని 188 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో మట్టపల్లి నీటి శుద్ధి కేంద్రం నుంచి 75 గ్రామాలకు ప్రత్యేక పైప్ లైన్ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. ఇందులో మఠంపల్లి మండలంలో 40 పాలకవీడు మండలంలో 15 గరిడేపల్లి మండలం 11, హుజూర్‌నగర్ మండలంలో 7, మేళ్లచెరువు మండలం లో 2 గ్రామాల తాగునీటి అవసరాలకు ఈ నీరే ప్రధానం.
ఇవి కాక చింతలపాలెం మండలంలోని బుగ్గమాదారం, కిష్టాపురం వద్ద గల గ్రిడ్ ల ద్వారా ఆ పరిధిలో మరో 113 గ్రామాలకూ ఇదే నీరు వెళుతుంది. నీరు కలుషితం కావడంతో సరఫరాను నిలిపివేశారు. ఇప్పుడు ఈ మొత్తం గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది ఏర్పడింది.
ప్రత్యామ్నాయాలపై ఫోకస్
తాగునీరు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల ఆఫీసర్లకు సూచించారు. మట్టపల్లిలోని అన్నదాన సత్రాలకు, స్వామి వారి నిత్య కైంకర్యాలు, అభిషేకాలకు ఇప్పటికే బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
భక్తుల తాగునీరు, షవర్ బాత్ లకు కూడా ఈ నీటినే వినియోగిస్తున్నారు.ఈ నెల 30 న ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. వారి నీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు.
నీటి శాంపిల్స్ సేకరణ
వ్యర్థ రసాయనాల తీవ్రత తగ్గించి నీటిని యథాతధ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ నెల 23 న నీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపారు. ఫలితాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని వెల్లడించారు. కెమికల్స్ ధాటికి సమీపంలోని చేపలు మృత్యువాత పడ్డాయి. జాలర్లు వేటకు వెళ్లవద్దని ఆఫీసర్లు
సూచించారు.
ఫలితాల కోసం ఆగాలి
నీటిలో ఏ రసాయనాలు ఎంత మోతాదులో కలిశాయో తేలాల్సి ఉంది. ఈ రసాయనాలు నదిలోని ఇతర వ్యర్థాల ద్వారా ఏదైనా బాక్టీరియా ఉత్పత్తి జరిగిందా లేదా అని టెస్టుల ద్వారా బయట పడుతుంది. ఈ ఫలితాలు రావడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఈ లోగా వ్యర్థాలను తొలగించాలని స్థానిక జాలర్లకు సూచించాం. మధ్యాహ్నం సమయంలో సూర్యరశ్మికి రసాయనాల విచ్చిత్తి జరిగినా రాత్రి సమయానికి మళ్లీ అలాగే ఉంటోంది. నీటి ప్రవాహానికి వ్యర్థాలు మెల్లగా కొట్టుకుపోతున్నాయి
- నాగభూషణం, ఎస్ఈ, ఇరిగేషన్, కోదాడ.
