వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.5 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. గురువారం జలసౌధలో బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా అధ్యక్షతన తెలంగాణ, ఏపీ ఈఎన్ సీలు, ఇంజనీర్లు సమావేశమయ్యారు. ఈ నెల 11 నాటికి శ్రీశైలంలో 46.98 టీఎంసీలు, నాగార్జునసాగర్ లో 157.05 టీఎంసీల నీళ్లు ఉన్నాయని బోర్డు తెలిపింది. శ్రీశైలంలో 18 టీఎంసీలు, సాగర్ లో 33.713 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చంది. మొత్తంగా కృష్ణా బేసిన్ లో 51.713 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తెలంగాణ అవసరాల కోసం 29 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు కమిటీ పేర్కొంది. మిషన్ భగీరథ అవసరాలకు కల్వకుర్తి నుంచి 3.5 టీఎంసీలు, సాగర్ నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు (ఆగస్టు -19 వరకు) 8.5 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద రబీ పంటలకు 9 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి శ్రీశైలం జలయాశం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి, ముచ్చు మర్రికి 3 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ రబీ పంటలకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3 టీఎంసీలు, కృష్ణా డెల్టా ఆయకట్టుకు 3.5 టీఎంసీలు కేటాయించారు. సాగర్ లో వీలైనన్ని ఎక్కువ రోజులు నీటి మట్టం 510 అడుగుల వరకు ఉండాలని నిర్ణయించారు. సాగర్ లోని కుడి, ఎడమ కాల్వల పవర్ హౌస్ లతోనే నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి ఒకేసారి తెలంగాణ, ఏపీలకు నీటిని విడుదల చేయడానికి రెం డు రాష్ట్రా లు అంగీకరిం చాయి. కృష్ణా డెల్టాకు సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం నుంచే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
