- రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చిన కృష్ణా బోర్డు
- నీళ్లు సాగర్‌లోకి వదలకుండా రాష్ట్రాలను కట్టడి చేయలేకపోయిన బోర్డు
- ఏపీకి మేలు చేసేందుకే మీటింగ్ అంటున్న తెలంగాణ ఇంజనీర్లు
- నీటిని రివర్స్ పంపింగ్ చేసేందుకు ఒప్పించేందుకేనని వాదన
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలంలో నీళ్లన్నీ పోయినంక కృష్ణా బోర్డు హడావుడి మొదలు పెట్టింది. తెలంగాణలో 19 నియోజకవర్గాలకు తాగునీళ్లు, లక్షన్నర ఎకరాలకు సాగునీళ్లు అందకుండా పోయే పరిస్థితి వచ్చినంక మేల్కొంది. రిజర్వాయర్ నీటి వినియోగంపై చర్చించేందుకు త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామంటూ తెలంగాణ, ఏపీకి సమాచారం ఇచ్చింది. గురువారమే సమావేశం పెట్టాలనుకున్నా వీలుపడలేదు. దీంతో మార్చి 3న సమావేశం నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టులోని నీళ్లను నాగార్జునసాగర్‌లోకి వదిలేయకుండా రెండు రాష్ట్రాలను కట్టడి చేయలేకపోయిన బోర్డు.. ఇప్పుడు నీళ్లన్నీ పోయాక త్రీమెంబర్ కమిటీ మీటింగ్ పెట్టి ఏం చేస్తుందని ఇరిగేషన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు పెట్టే మీటింగ్ కూడా ఏపీకి మేలు చేయడానికేనని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.
సాగర్‌లోని బ్యాక్ వాటర్‌ను రివర్స్ పంపింగ్ చేసేలా తెలంగాణను ఒప్పించేందుకే ఈ సమావేశం పెట్టారని చెప్తున్నారు. లేఖ రాసి సైలెంట్
బోర్డు ఏర్పాటు తర్వాత ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్ల ప్రారంభంలో సాగు, తాగు నీటి అవసరాలపై రెండు రాష్ట్రాలతో చర్చించేది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ ఇయర్లో బోర్డు సమావేశాలు జరిగింది చాలా తక్కువ. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై ఇప్పటిదాకా చర్చించనేలేదు. వానాకాలం మొత్తం గడిచిపోయాక.. రెండు రాష్ట్రాల నుంచి బోర్డు వాటర్ ఇండెంట్ తీస్కొని వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు రెండు రాష్ట్రాలను ఇండెంట్ కోరినా ప్రస్తుతం శ్రీశైలంలో నీళ్లు లేకపోవడంతో కేవలం తాగునీటి కోసమే తిరిగి ఇండెంట్ ఇవ్వాలంటూ ఈ నెల రెండో వారంలో సూచించింది. రిజర్వాయర్‌లో నీటిమట్టం పడిపోతోంది కాబట్టి కరెంట్ ఉత్పత్తిని ఆపేయాలంటూ లేఖ రాసి సైలెంట్ అయిపోయింది. శ్రీశైలం నీటిని సాగర్‌లోకి వదలకుండా మాత్రం కట్టడి చేయలేకపోయింది.
ఆగని పవర్ జనరేషన్
శ్రీశైలం నీటిమట్టం 803 అడుగులకు పడిపోయినా కరెంట్ ఉత్పత్తి మాత్రం ఆగడం లేదు. వారం క్రితం కల్వకుర్తి పంపులను బంద్పెట్టిన తెలంగాణ.. గురువారం మళ్లీ లిఫ్టింగ్‌ను మొదలుపెట్టింది. 604 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసింది. రెండు రాష్ట్రాలు రివర్స్ పంపింగ్ ద్వారా 548 క్యూసెక్కులు ఎత్తిపోయగా, కరెంట్ ఉత్పత్తి కోసం మరో 883 క్యూసెక్కుల నీటిని వాడాయి. దీంతో శ్రీశైలంలో నీటి నిల్వ 30.74 టీఎంసీలకు పడిపోయింది. నిరుడు ఇదే టైంకు రిజర్వాయర్‌లో 105.65 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలం నుంచి సాగర్‌కు కొద్దిపాటి వరద వస్తోంది. ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు గాను 267.61 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. నిరుడు ఇదేటైంకు సాగర్‌లో 213.76 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. శ్రీశైలంలో నిల్వ ఉండాల్సిన 50 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణా బోర్డు నిర్లక్ష్యం కారణంగా రెండు రాష్ట్రాలు కరెంట్ ఉత్పత్తి ద్వారా సాగర్‌లోకి వదిలేశాయి.
