- వాస్తవానికి రాష్ట్రం వాటా 70 శాతం
- ఎల్‌నినో కారణంతో తక్కువడిగాం
- కేఆర్ఎంబీ సమావేశంలో మన వాదనిదే
- నేడు కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వినియోగంపై మరోసారి కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ సమావేశం కానుంది. గత నెల 24న జరిగిన మీటింగ్‌లో నీటి పంపకాల విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ నెల 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం త్రీమెంబర్ కమిటీ మీటింగ్నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో గత సమావేశం ఏమీ తేలకుండానే ముగిసింది. తాజా సమావేశంలో ఏపీ.. వెలిగొండ టన్నెల్ నుంచీ నీళ్లు తీసుకెళ్తుండడంపై త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌లో ఫిర్యాదు చేసేందుకు మన అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పోతిరెడ్డిపాడుపై గత మీటింగ్‌లో బోర్డుకు ఫిర్యాదు చేసిన అధికారులు.. ఇప్పుడు వెలిగొండ నుంచి కూడా దాని కెపాసిటీకి మించి నీటిని తోడేస్తుండడంపై ఫిర్యాదు చేయనున్నారు. వెలిగొండ టన్నెల్ కెపాసిటీ 3 వేల క్యూసెక్కులే కాగా.. ప్రస్తుతం 3,500 క్యూసెక్కులను ఏపీ తరలిస్తున్నది. టన్నెల్ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు ఒక టీఎంసీ నీటిని వెలిగొండ టన్నెల్ ద్వారా ఏపీ తరలించుకున్నది. మరోవైపు పోతిరెడ్డిపాడు నుంచి 8 వేల క్యూసెక్కులను తీసుకుపోతున్నది. మల్యాల నుంచి 2,700 క్యూసెక్కులు తీస్కుపోతున్నది. అదే సమయంలో సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6,500 క్యూసెక్కులను తరలిస్తున్నది. పది రోజుల క్రితం ఏపీ బలవంతంగా సాగర్ కుడి కాల్వ నుంచి నీటిని తరలించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపైనా త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌లో అధికారులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక, ఏపీ అధికారులు తమకు కావాల్సిన అంశాలతో ఇండెంట్ తయారు చేసి నేరుగా సమావేశంలోనే బోర్డు ముందు పెట్టనున్నట్టు తెలిసింది.
గత మీటింగ్‌లో కుదరని సయోధ్య
గత నెల 24న నిర్వహించిన మీటింగ్‌లో నీటి వాటాలపై తెలంగాణ, ఏపీ పట్టుబట్టాయి. తెలంగాణ అధికారులు పోతిరెడ్డిపాడుపై నియంత్రణ పెట్టాలని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. 70 శాతం నీళ్లు తమకే రావాల్సి ఉన్నా.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో 50 శాతానికి పరిమితమవుతున్నామని పేర్కొంది. మొత్తంగా తాగునీటి అవసరాలకే 112 టీఎంసీలు కావాలని తేల్చి చెప్పింది. అయితే, ఏపీ మాత్రం అక్టోబర్ వరకే 47 టీఎంసీలు కావాలని పట్టుబట్టింది. బోర్డు కూడా తాగునీటికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది.
అయితే, ఈ అంశాలపై ఎటూ తేలకుండానే ఆ సమావేశం ముగిసింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. నెల రోజులుగా ప్రాజెక్టుకు సరైన ఇన్‌ఫ్లోస్ కూడా లేవు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులకు వరదలు రావడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 145 టీఎంసీలకు పడిపోయింది. రెండు వారాల క్రితం ప్రాజెక్టులో 180 టీఎంసీలదాకా నీళ్లుండగా.. ఈ గ్యాప్‌లోనే 35 టీఎంసీలు ఖాళీ అవ్వడం గమనార్హం. నాగార్జునసాగర్‌లో 179.50 టీఎంసీల వాటర్ ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం ముదురుతుండడంతో వచ్చే ఎండా కాలం వరకు నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
