హిల్ట్ పాలసీతో రూ.5 లక్షల కోట్లు లూటీ : కేటీఆర్

హిల్ట్ పాలసీతో రూ.5 లక్షల కోట్లు లూటీ : కేటీఆర్
  • ఢిల్లీకి కప్పం కట్టేందుకే కాంగ్రెస్ రియల్ ​ఎస్టేట్ ​దందా: కేటీఆర్
  • హిల్ట్​ పాలసీని వ్యతిరేకిస్తూ జీడిమెట్లలో పర్యటన

జీడిమెట్ల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్​వ్యాపారం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక భూముల్ని చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే హిల్ట్ పాలసీ తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్  పాలసీని వ్యతిరేకిస్తూ గురువారం కుత్బుల్లాపూర్​ నియోజవర్గం జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాలో కేటీఆర్​ పర్యటించారు. 

ఈ సందర్భంగా హమాలీ కార్మికులతో ఆయన ముచ్చటించారు. రేవంత్​రెడ్డి ప్రభుత్వం హిల్డ్​పాలసీతో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్​ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించి ప్రతిఫలంగా రూ.5 లక్షల కోట్లు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. 

ఆ విధంగా వసూలు చేసిన డబ్బుతో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి ఎలక్షన్స్ లో​గెలవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. 9,300 ఎకరాల భూమిని కాజేసీ రూ.5 లక్షల కోట్లు దండుకుని ఢిల్లీకి కప్పం కట్టి తమ పదువులు నిలుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదవారికి ఇండ్లు కట్టించలేని ప్రభుత్వం బడాబాబులకు మాత్రం చౌకగా స్థలాలు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు తాము వ్యతిరేకం కాదని, అన్నిరకాల పరిశ్రమల తరలింపుతో కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మేము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తం

రేవంత్​సర్కార్​భూకుంభకోణంతో ఇండస్ట్రియల్ వర్గాలు మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత కచ్చితంగా ఆ విధానం రద్దు చేస్తామన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను తరలించాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో ముచ్చర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే.. అక్కడ కూడా రేవంత్​రెడ్డి రియల్ ఎస్టేట్​దందా చేస్తున్నారని ఆరోపించారు. 

ఆయన భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించడం తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే కోకాపేటలో 130 కోట్లకు ఎకరా ఉందని గొప్పలు చెప్పి.. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిమెట్లలో ఎకరా కోటి  అనడంలో ఆంతర్యమేమిటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. త్వరలోనే అఖిలపక్ష, రౌండ్​టేబుల్​సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.