- తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు
- వెలుగులో వచ్చిన “చెక్ పోస్టులు ఎత్తేసినా..ఆగని దందా” వార్తపై సీఎంవో సీరియస్
- విచారించి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎత్తివేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద, వాటికి సమీపంలో ట్రాన్స్‌పోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ లు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాహనాల తనిఖీలను చేయొద్దని రవాణా శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల డీటీసీలు, ఆర్టీఏలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గురువారం వెలుగు దినపత్రికలో వచ్చిన “ చెక్ పోస్టులు ఎత్తేసినా.. ఆగని దందా”పై సీఎంవో సీరియస్ అయింది.
ఈ వార్తపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఇలంబర్తిని ఆదేశించింది. దీంతో గురువారం ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులు జూమ్ లో అన్ని జిల్లాల ఆర్టీఏ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆ వార్తపై వివరణతో కూడిన నోట్ ను కూడా ఖైరతాబాద్ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు విడుదల చేశారు. వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లోని ఏ అధికారి అయినా బాధ్యతారహితంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్టు అధికారులు వాహనాల తనిఖీల సందర్భంలో ఎవరి వద్దనైనా అనధికార వసూళ్లకు పాల్పడితే వాహనదారులు రవాణా శాఖ అధికారిక ఈ మెయిల్ jtcit--_transport@telangana.gov.in ద్వారా లేదా 040–23370081,82,83 హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చెక్ పోస్టులు ఎత్తేసిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ మొబైల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ లు నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తాయని అందులో పేర్కొన్నారు.
రాత్రిపూట కూడా జిల్లాల స్థాయిలో ప్రత్యేక తనిఖీలు, స్పెషల్ డ్రైవ్ లు కొనసాగుతాయని, ఇతర రాష్ట్రాల వాహన పర్మిట్ లు, పన్ను చెల్లింపులు పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలోనే కొనసాగుతాయని అందులో వివరించారు. ఫిట్‌నెస్ లేని వాహనాలపై, ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. నిరంతర తనిఖీల వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నదని, పైగా రోడ్డు ప్రమాదాలను నివారించడం జరుగుతోందని పేర్కొన్నారు.
